విజయవాడ నుంచి ముంబయికి నూతన విమాన సర్వీస్... ఫలించిన ఎంపీ బాలశౌరి కృషి
విజయవాడ నుంచి ముంబయికి నూతన విమాన సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి చొరవతో అందుబాటులోకి వచ్చిన ఈ సర్వీసు... శనివారం నుంచే ప్రారంభం కానుంది.
మచిలీపట్నం ఎంపీ బాలశౌరి చొరవతో విజయవాడకు సమీపంలోని గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ముంబయి నగరానికి ఎయిర్ ఇండియా సంస్థ నూతన సర్వీసును శనివారం నుంచి ప్రారంభించనుంది. ఎంపీ బాలశౌరి ఎయిర్‌పోర్టు అథారిటీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో గతంలో పలుమార్లు విజయవాడ నుంచి ముంబయి నగరానికి విమాన సర్వీసు ఏర్పాటు చేయాలని సంబంధిత మంత్రిని, అధికారులను కలిశారు. ఈ మేరకు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో శనివారం గన్నవరం నుంచి ముంబయి నగరానికి విమాన సర్వీసు ప్రారంభం కానుంది.
గతంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు విజయవాడ నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరానికి ఎయిర్ ఇండియా వారి విమాన సేవలను ప్రారంభం కానుండగా.. ఈ విమాన సర్వీసును మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి చేతుల మీదుగా ప్రారంభం కాబోతుంది. దీంతో విజయవాడ, గుంటూరు, ఒంగోలు, ఏలూరు పట్టణ పరిసర ప్రాంత వ్యాపారులు, ఇతర అవసరాల నిమిత్తం విజయవాడ నుంచి ముంబయికి, ముంబయి నుంచి విజయవాడ వచ్చేందుకు వీలు కలుగనుంది.
కేంద్ర పెద్దలతో అనేకమార్లు చర్చలు...
విజయవాడ- ముంబయి విమానయాన సౌకర్యం కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ బాలశౌరి గతంలో అనేకమార్లు కోరారు. ఢిల్లిలోని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, అధికారులతో గతంలో ఇదే విషయంపై పలుమార్లు చర్చలు జరిపారు. సదరు చర్చల ఫలితంగా విజయవాడ నుంచి ముంబయి నగరానికి నూతన విమాన సర్వీసు అందుబాటులోకి వస్తోంది. ఈ సందర్బంగా విజయవాడ ప్రాంతం నుంచి ముంబయి వెళ్లే విమాన ప్రయాణికులు, వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నూతన సర్వీసు ఈ విధంగా ఉంటుంది..
సర్వీస్ టైమ్ ఇదే...
15.06.2024 శనివారం సాయంత్రం 5.45 గంటలకు ముంబయి నుంచి విజయవాడకు విమానం వస్తుంది. తిరిగి 7.10 గంటలకు విజయవాడ నుంచి ముంబయికు అదే విమానం వెళ్తుంది. రోజూ ఇదే మాదిరిగా సర్వీసు ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఎయిరిండియా ఫ్లయిట్ AI 599 నంబరుపై సర్వీసు ప్రతిరోజు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. సుమారు 180 మంది ప్రయాణికులు ఈ విమానంలో ప్రయాణించవచ్చన చెబుతున్నారు.
సర్వీసు వల్ల ఉపయోగాలు..
గన్నవరం (విజయవాడ) ఎయిర్‌పోర్టు నుంచి ముంబయికి నూతనంగా ప్రారంభం కానున్న ఎయిర్ ఇండియా సర్వీసు అందుబాటులోకి వస్తే.. విదేశాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ముంబయి నుంచి అనేక దేశాలకు విమాన సర్వీసులు ఉన్నాయి.. దీంతో రేపటి నుంచి ప్రారంభం కానున్న విమాన సర్వీసు ఆయా దేశాలకు వెళ్లే కనెక్టింగ్ ఫ్లైట్‌గా సేవలు అందించనుంది. చివరిగా కోరిన వెంటనే విమాన సర్వీసు మంజూరు చేయించిన కేంద్ర ప్రభుత్వ పౌర విమానయాన శాఖకు ఎంపీ బాలశౌరి ధన్యవాదాలు తెలియజేశారు.