ఏపీలో ప్రభుత్వం మారిపోవడంతో చకచకా అన్నీ మారిపోతున్నాయి. పలు కీలక శాఖల అధికారులు సెలవు పెట్టి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా కొత్త సీఎస్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు  జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ జీఓఆర్టీ సంఖ్య 1034 ద్వారా శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించనున్నారు. కొత్త సీఎస్‌గా నియామకమైన నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ బుధవారమే చంద్రబాబును కలిశారు.

 

నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ 1987 బ్యాచ్‌కు ఐఏఎస్‌ అధికారి. 

సీఎస్‌గా బాధ్యతలు చేపట్టే ముందువరకు ఆంధ్రప్రదేశ్‌ పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 

ఇప్పటి వరకు చీఫ్‌ సెక్రటరీగా ఉన్న కేఎస్‌ జవహర్‌రెడ్డి సెలవుపై వెళ్లగా... ఆయన స్థానంలో నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌ నియమితులయ్యారు. 

గతంలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (HMDA) కమిషనర్ గా పనిచేశారు.

నవ్యాంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వ పాలనలో టూరిజం, సాంస్కృతిక శాఖల ముఖ్య కార్యదర్శిగానూ విధులు నిర్వర్తించారు.

 

 

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త సీఎస్‌ నియామకం జరిగిన నేపథ్యంలో జవహర్‌ రెడ్డి బదిలీ అయ్యారు. గత ప్రభుత్వంలో వైసీపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలు జవహర్‌ రెడ్డిపై ఉన్నాయి. ఎన్నికల వేళ ఆయన్ను సీఎస్ బాధ్యతల నుంచి తప్పించాలని ప్రతిపక్ష కూటమి అనేక మార్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఉత్తరాంధ్రలో భారీ భూ కుంభకోణం వెనుక జవహర్‌ రెడ్డి పాత్ర ఉందని ఎన్నికల వేళ తీవ్ర ఆరోపణలు వినిపించాయి.