సారాంశం

Andhra Pradesh CS : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ శుక్ర‌వారం బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర క్యాడర్ లో సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారి అయిన ఆయన ఈ నెల 12న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవాన్ని పర్యవేక్షించనున్నారు.
 

AP CS Neerabh Kumar Prasad : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) జూన్ 7న (శుక్రవారం) జారీ చేసిన స‌ర్క్యూల‌ర్ ప్ర‌కారం బదిలీ చేయబడిన కేఎస్ జవహర్ రెడ్డి స్థానంలో నీరభ్ కుమార్ ప్రసాద్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా నియ‌మిస్తున్న‌ట్టు పేర్కొంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న శుక్రవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో సీఎస్ చాంబరులో బాధ్య‌త‌లు స్వీక‌రించారు.

తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు, విజయవాడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానాల వేద పండితుల దివ్య ఆశిస్సుల మధ్య నీరబ్ కుమార్ ప్రసాద్ సీఎస్ గా బాధ్యతలు స్వీకరించార‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు పేర్కొన్నాయి. సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన త‌ర్వాత నీరబ్ కుమార్ ప్ర‌సాద్ మాట్లాడుతూ.. సీఎస్ గా పనిచేసే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయనున్న ఎన్.చంద్రబాబు నాయుడు, ఇత‌రుల‌కు కృతజ్ణతలు తెలిపారు. అలాగే, సహచర కార్యదర్శులు,శాఖాధి పతులు,ఇతర అధికారులు,సిబ్బంది సహకారంతో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్ళేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. 

ఎవ‌రీ నీర‌బ్ కుమార్ ప్రసాద్..? 

బీటెక్.మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన నీర‌బ్ కుమార్ ప్ర‌సాద్ 1988లో పశ్చిమ గోదావరి జిల్లాలో అసిస్టెంట్ కలక్టర్(ట్రైనీ)గా ఉద్యోగ బాధ్యతలతో త‌న ప్ర‌యాణం మొద‌లు పెట్టారు. 1990లో తూర్పు గోదావరి సబ్ కలక్టర్ గా విధులు నిర్వ‌ర్తించారు. అలాగే, రంపచోడవరం సబ్ కలక్టర్ గానూ, 1991లో ఏటూరు నాగారం పీఓ ఐటీడీఏగా, 1992లో కృష్ణా జిల్లా పీడీ ఆర్డీఏగానూ ఆయ‌న ప‌నిచేశారు. 1993లో కృష్ణా జిల్లా జాయింట్ కలక్టర్ గా,1996లో ఖమ్మం కలక్టర్ గా,1998లో చిత్తూరు కలక్టర్ గా పనిచేశారు.

1999లో యువజన సంక్షేమశాఖ డైరెక్టర్, శాప్ ఎండిగా పనిచేసి నీర‌బ్ కుమార్ ప్ర‌సాద్ 2000 ఏడాదిలో కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్ పై వెళ్ళారు. 2005లో రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ వీసీ అండ్ ఎండిగా, 2007లో పరిశ్రమల శాఖ కమీషనర్ గా, 2009లో మత్స్యశాఖ కమీషనర్ గా, ఎపి ఎస్ హెచ్సి ఎండిగా పనిచేశారు. 2012లో రాష్ట్ర మున్సిపల్ పరిపాలన అండ్ పట్టణాభివృద్ధి సంస్థ కమీషనర్  బాధ్య‌త‌లు చేప‌ట్టారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో జీఏడీ ముఖ్య కార్యదర్శి కొన‌సాగిన ఆయ‌న 2015లో వైఏటీసీ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు.

2017లో కార్మిక ఉపాధి కల్పన అండ్ శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా ప‌నిచేశాడు. 2018లో టీఆర్ అండ్ బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా, 2019లో రాష్ట్ర పర్యావరణ, అటవీ,శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు. 2019 నవంబరు నుండి చీఫ్ కమీషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ)గా పనిచేసి ాయన..  2022 ఫిబ్రవరి 23 నుండి రాష్ట్ర పర్యావరణ,అటవీ,శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

'ఇది యుద్ధం కాదు బాసు'.. భార‌త్-పాకిస్తాన్ మ్యాచ్ పై హార్దిక్ పాండ్యా ఏమ‌న్నాడంటే..?