కళ్ల ముందు ప్రమాదం జరిగితే చాలా మంది చూసీ చూడనట్లు వ్యవహరిస్తారు. మరికొందరు మంచితనంతో 108కి ఫోన్ చేసి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తారు. కాగా... తన కళ్ల ముందు జరిగిన ఓ రోడ్డు ప్రమాదం పట్ల మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించిన తీరు ఇప్పుడు అభినందనీయంగా మారింది. 

ఇంతకీ మ్యాటరేంటంటే... సోమవారం ఉదయం మంత్రి అనిల్ నెల్లూరు నుంచి అమరావతికి వస్తుండగా  మార్గమధ్యంలో రోడ్డు ప్రమాదం జరగాన్ని గుర్తించారు. దీంతో వెంటనే తన డ్రైవర్‌తో చెప్పి కారును ఆపించిన అనిల్.. రోడ్డు ప్రమాద బాధితులకు బాసటగా నిలిచారు. ప్రమాదంలో గాయపడినవారిని చూసి చలించిపోయి తన కారులో వారిని వెంటనే ఆస్పత్రికి తరలించాలని సూచించారు.

108 వాహనం రావడానికి సమయం పట్టేలా ఉందని.. తన కారులోనే క్షతగాత్రులను ఆస్పత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. అయితే.. అంతలోనే 108 రావడంతో మంత్రి అనుచరులు క్షతగాత్రులను ఆ వాహనంలో ఎక్కించి ఆస్పత్రికి తరలించారు. 

ప్రాథమిక చికిత్స అనంతరం 108లో వారిని అక్కడ్నుంచి తరలించే వరకూ మంత్రి అనిల్ అక్కడే ఉండి అన్నీ చూసుకున్నారు. మంత్రి అనిల్ చేసిన ఈ మంచి పనికి అభిమానులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తూ మెచ్చుకుంటున్నారు.