నెల్లూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వలసల పర్వం కొనసాగుతుంటే ఆ పార్టీ నిర్వహించతలపెట్టిన కార్యక్రమాలు మాత్రం వాయిదాలు పడుతున్నాయి. ఇప్పటికే వైఎస్ జగన్ నూతన గృహప్రవేశం, పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం వాయిదా పడ్డాయి. 

తాజాగా వైఎస్ జగన్ ఎన్నికల వ్యూహంలో భాగంగా నిర్వహిస్తున్న వైసీపీ సమర శంఖారావం సభలు కూడా వాయిదా పడుతున్నాయి. ఈనెల 19న నెల్లూరు జిల్లాలో జరగాల్సిన వైసీపీ సమర శంఖారావం సభ వాయిదా పడింది. 

ఈనెల 19న నెల్లూరులో భారత ఉపరాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడులు పర్యటిస్తున్న నేపథ్యంలో సభ వాయిదా వేసుకోవాలని పోలీసులు వైసీపీ నేతలకు సూచించారు. నాలుగు రోజులపాటు వాయిదా వేసుకోవాలని సూచించడంతో వైఎస్ జగన్ నెల్లూరు సమర శంఖారావం సభను వాయిదా వేసినట్లు తెలుస్తోంది. 

జగన్ లండన్ పర్యటన అనంతరం నెల్లూరులో సమర శంఖారావం సభ జరగనుంది. ఇకపోతే వైఎస్ జగన్ ఐదు జిల్లాలో వైఎస్ఆర్సీపీ సమర శంఖారావం సభల షెడ్యూల్ ప్రకటించారు. అయితే అందులో ఇప్పటి వరకు మూడు పూర్తికాగా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల సభలు వాయిదా పడ్డాయి.