Asianet News TeluguAsianet News Telugu

ఆరోగ్య శ్రీకి ధీటుగా ‘‘ఆరోగ్య రక్ష’’.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యక్రమం, వైసీపీ వర్గాల్లో చర్చ

ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్యశ్రీకి ధీటుగా తన నియోజకవర్గంలో ఆరోగ్య రక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వైసీపీ నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.  నెల్లూరు నగరంలోని 6 ఆసుపత్రులకు చెందిన 33 మంది వైద్యులు, రెండు సామాజిక సేవా సంస్థలు ఈ కార్యక్రమంలో భాగమయ్యాయని కోటంరెడ్డి పేర్కొన్నారు.

nellore rural mla kotamreddy sridhar reddy announces arogya raksha
Author
First Published Jan 28, 2023, 3:22 PM IST

వివాదాస్పద వ్యాఖ్యలు, ప్రవర్తనతో నిత్యం వార్తల్లో వుండే వైసీపీ నేత, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా, పార్టీలకు, కుల మతాలకు అతీతంగా తన సొంత ఖర్చుతో ప్రజలకు వైద్య సేవలు అందించే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. దీనికి ‘‘ఆరోగ్య రక్ష’’ అనే పేరు పెట్టారు. దీనిపై ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ఆరోగ్యశ్రీ వల్ల కొంతమందికి మాత్రమే లబ్ధి చేకూరుతుందని, కానీ తన ఆరోగ్య రక్ష కార్యక్రమం వల్ల అన్ని రకాల వ్యాధులకు చికిత్స, మందులు అందిస్తామన్నారు. అందరూ ఆరోగ్యంగా వుండాలనే ఉద్దేశంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. 

ఈ కార్యక్రమం కింద ఆపరేషన్‌తో పాటు వారికి ఉచితంగా మందులు కూడా అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమం కోసం కొంతమంది కార్పోరేట్ ఆసుపత్రులు , నిపుణులైన వైద్యుల సాయం తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. నెల్లూరు నగరంలోని 6 ఆసుపత్రులకు చెందిన 33 మంది వైద్యులు, రెండు సామాజిక సేవా సంస్థలు ఈ కార్యక్రమంలో భాగమయ్యాయని కోటంరెడ్డి పేర్కొన్నారు. పేదలకు కార్పోరేట్ వైద్యం అందించాలనే దీనిని నిర్వహిస్తున్నానని.. దీనిలో ఎలాంటి రాజకీయ ప్రయోజనాన్ని తాను ఆశించడం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. 

కాగా.. కొద్దిరోజుల క్రితం నెల్లూరు జిల్లాలోని వైసీపీ సీనియర్ నేతలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఎదుగుదలన జిల్లాలోని కొన్ని పెద్ద కుటుంబాలు అడ్డుకుంటున్నాయని అన్నారు. వాళ్లు ఎన్నోసార్లు తన గొంతు కోశారని కోటంరెడ్డి తీవ్రవ్యాఖ్యలు చేశారు. వాళ్లు ఎమ్మెల్యేలుగా వుంటూ.. కొడుకులు, బామ్మర్దులు చివరికి పుట్టబోయే మనవళ్లు కూడా ఎమ్మెల్యేలుగా వుండాలని అనుకుంటున్నారని కోటంరెడ్డి అన్నారు. ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి పదవులు తమకే కావాలని అంటున్నారని .. ఇకపై వారి ఆటలు సాగవని శ్రీధర్ రెడ్డి హెచ్చరించారు. 

ALso Read: పుట్టబోయే మనవళ్లు కూడా ఎమ్మెల్యేలు కావాలట : ఆ ‘‘ పెద్ద కుటుంబాలు’’ అంటూ కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఇటీవల అధికారులతో సమీక్ష సందర్భంగా  కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సౌత్ మోపూరులోని మొగిలిపాలెం వద్ద సవిటి వాగు తెగిపోయి దాదాపు 150 ఎకరాల వరకు పంట పొలాలు నీటమునిగాయి. అధికారుల వైఖరి కారణంగానే ఇలా జరిగిందంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శలు చేశారు. పై నుంచి ఎంత వరద వస్తుందో తెలియదా అంటూ ఇరిగేషన్ అధికారులను కడిగిపారేశారు.

మంత్రులు మారినా పనులు జరగడం లేదంటూ శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. బొత్స మున్సిపల్ శాఖ మంత్రిగా వున్నప్పుడు హామీ ఇచ్చిన పనులు ఇంకా మొదలు కాలేదని ఆయన దుయ్యబట్టారు. నెల్లూరు నగరంలోని కొత్త రోడ్ల నిర్మాణంపైనా కోటంరెడ్డి అధికారులపై మండిపడ్డారు. పొట్టేపాలెం వద్ద ఫ్లై ఓవర్ నిర్మాణానికి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని.. దీనిపై అధికారుల్ని అడిగితే సరిగ్గా సమాధానం ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. ఇదంతా చూసి జనం ఇదేం ఖర్మ అనుకుంటున్నారంటూ మంత్రి కాకాణి ముందే కోటంరెడ్డి శ్రీధన్ రెడ్డి అధికారులకు క్లాస్ పీకారు. 

Follow Us:
Download App:
  • android
  • ios