స్వామి వారి రథోత్సవంలో అపశ్రుతి.. భయంతో పరుగులు తీసిన భక్తులు
నెల్లూరు జిల్లా కొండ బిట్రగుంటలోని ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఊరేగింపు జరుగుతుండగా.. ఒక్కసారిగా భారీ రథం కిందపడిపోయింది. ఈ సమయంలో భక్తులంతా అప్రమత్తంగా ఉండటంతో ప్రాణనష్టం తప్పింది.
నెల్లూరు జిల్లా కొండ బిట్రగుంటలోని ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి నిర్వహించిన రథోత్సవంలో ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి 9 గంటల సమయంలో స్వామి వారి భారీ రథం ఊరేగింపు జరుగుతుండగా.. ఒక్కసారిగా రథం కిందపడిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మంగళవారం నాడు ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో స్వామి వారి రథోత్సవం ప్రారంభమైంది. ఈ ఉత్సవం చివరి వరకూ ఎలాంటి ఆటంకాలు ఎదురు కాకుండా సాగుతుందని, మరి కొద్ది నిమిషాల్లో ముగుస్తుందనే క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. పాత బిట్రగుంట నుంచి తిరిగి వస్తుండగా.. కొత్త బిట్రగుంట ఎంట్రన్స్ లో సిమెంట్ రోడ్డులోని సైడ్ కాలువలో రథం చక్రం ఇరుక్కుపోయింది. దాంతో రథం కింద పడిపోయింది. వెంటనే భక్తులు అప్రమత్తమయ్యారు.
సహాయక చర్యలు చేపట్టి రథాన్ని నిలబెట్టారు. దాంతో మళ్లీ ఊరేగింపు ప్రారంభమైంది. దేవతామూర్తుల విగ్రహాలకు సంప్రోక్షణ చేశాకే ఆలయంలోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఎస్పీ విజయారావు ఆదేశాల మేరకు డీఎస్పీ వెంకటరమణ రంగంలోకి దిగారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.