విజయవాడ: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులు కేసులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే డజనకు పైగా టీడీపీ నేతలు కేసులను ఎదుర్కొంటున్నారు. 

తాజాగా వారి జాబితాలోకి విజయవాడ ఎంపీ కేశినేని నాని చేరారు. ఎంపీ కేశినేని నానిపై చర్యలు తీసుకోవాలంటూ నాయి బ్రహ్మణ సంఘం నేతలు కడప డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమ కులాన్ని కించపరిచేలా మాట్లాడారంటూ ఆరోపించారు. 

కేశినేని నానిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డీఎస్పీని కోరారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం గతంలో తమను సచివాలయంలో బహిరంగంగా దూషించారని మళ్లీ అదేపార్టీకి చెందిన కేశినేని నాని కించపరిచేలా వ్యవహరించారని మండిపడ్డారు. 

తమ మనోభవాలు దెబ్బతినేలా ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలు చేశారని తక్షణమే క్షమాపణ చెప్పాలని రాష్ట్ర నాయీబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు యానాదయ్య డిమాండ్‌ చేశారు. నాయి బ్రాహ్మణలు కులాన్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడలో నాయిబ్రాహ్మణలు ఆందోళన చేపట్టారు. 

ఎంపీ కేశినేని నాని కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. నానిని టీడీపీ నుంచి బహిష్కరించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నుంచి నానిని సస్పెండ్‌ చేయకుంటే చంద్రబాబు ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. 

బీసీ కులాలను అవమానించిన చంద్రబాబుపైనా కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. టీడీపీ నాయకులకు అధికారం కత్తిరించినా అహంకారం తగ్గలేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 
గతంలో తమ తోకలు కత్తిరిస్తామన్న చంద్రబాబుకు ఎన్నికల్లో ఆయన తోక కత్తిరించినా సిగ్గు రాలేదని విరుచుకుపడ్డారు. 

తమతో పెట్టుకుంటే  పిల్లిబొచ్చు కాదు నీ నాలుక కత్తిరిస్తాం జాగ్రత్త అంటూ కేశినేని నానిపై మండిపడ్డారు. నాయీబ్రాహ్మణులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన  కేశినేని నానిని అరెస్ట్  చేసి విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. 

నాయి బ్రహ్మణుల ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ గానీ విజయవాడ ఎంపీ కేశినేని నానిగానీ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. ఇప్పటి వరకు ఎలాంటి కేసులు లేకుండా ఉన్న కేశినేని నానిపై కడపలో కేసు నమోదు అవ్వడంపై ఆయన వర్గీయుల్లో ఆందోళన మెుదలైంది. 

ఈ వార్తలు కూడా చదవండి

వల్లభనేని వంశీది టీడీపీ డీఎన్ఏ.. పార్టీలోనే ఉంటారు: కేశినేని నాని

చంద్రబాబు సర్కార్ అవినీతి చేస్తే సీబీఐ విచారణ జరిపించండి: ఎంపీ కేశినేని నాని