ఇవాళ అమ్మవారి జన్మనక్షత్రం... పవిత్రమైన ఈ మూలా నక్షత్రంరోజున సరస్వతి దేవి అలంకరణలో దర్శనమిచ్చే విజయవాడ దుర్గమ్మను దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు.
విజయవాడ : దేవీ శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా నేడు విజయవాడ కనకదుర్గమ్మ సరస్వతీ దేవి అలంకరణలో దర్శమివ్వనున్నారు. అంతేకాదు నేడు(శుక్రవారం) మూలా నక్షత్రం... ఇది అమ్మవారి జన్మనక్షత్రం. దీంతో విజయవాడ కనకదుర్గ ఆలయానికి భక్తులు పోటెత్తారు. జన్మనక్షత్రం రోజున సరస్వతి దేవీ అలంకరణలోని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఇష్టపడుతుంటారు. ఇలా ఇవాళ ఉదయమే ఇంద్రకీలాద్రికి భక్తులు భారీగా చేరుకున్నారు.
ఇవాళ భక్తులు తండోపతండాలుగా ఆలయానికి తరలివస్తారని తెలిసి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. దర్శనానికి వెళ్లే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా భారీగా తరలివచ్చిన భక్తులను పోలీసులు కంట్రోల్ చేస్తున్నారు. స్వయంగా విజయవాడ పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా ఉదయమే ఆలయంవద్దకు చేరుకుని పరిస్థితిని గమనించి భక్తులను కంట్రోల్ చేసారు.
వీడియో
అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులతో క్యూలైన్ నిండిపోయింది. ఆలయం బయట వినాయక ఆలయం నుండి ఘాట్ రోడ్డు వరకు భక్తులు బారులు తీరారు. ఇలా ఇంద్రకీలాద్రి కొండ భక్తజనసంద్రంగా మారింది. భక్తులను కంట్రోల్ చేయడం ఆలయ సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులకు కష్టంగా మారింది. దీంతో రోప్ సాయంతో భక్తులను కంట్రోల్ చేస్తున్నారు.
Read More నవరాత్రి 6 వ రోజు.. కాత్యాయనీ దేవిని మహిషాసుర మర్దిని అని ఎందుకు పిలుస్తారో తెలుసా?
ఇవాళ ఒక్కరోజే అమ్మవారిని దాదాపు నాలుగు లక్షలమంది భక్తులు దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అమ్మవారి దర్శనానికి సమయం పడుతుందని... భక్తులు సంయమనం పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. విఐపి దర్శనాలను తగ్గించి క్యూలైన్ల బారులుతీరే సామాన్యులకు తొందరగా దర్శనం కల్పించాలని ఆలయ అధికారులను భక్తులు కోరుతున్నారు.
ఇదిలావుంటే దేవీ నవరాత్రుల సందర్భంగా విజయవాడ ఆలయ అధికారులు చేపట్టిన ఏర్పాట్లపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విఐపిల సేవల మునిగిపోయిన అధికారులు సామాన్య భక్తులను పట్టించుకోవడం లేదని అంటున్నారు. క్యూలైన్లలో చిన్నారులు, వృద్దులతో బారులుతీరినా అధికారులు పట్టించుకోవడం లేదని అంటున్నారు.
ఇక ఆలయ అధికారులు,, బోర్డు సభ్యులకు మద్య వివాదం రాజుకుంది. అధికారులు బోర్డు సభ్యులను చులకనగా చూస్తున్నారని... కనీస మర్యాద కూడా ఇవ్వడంలేదని ఆలయ పాలకమండలి సభ్యులు కట్టా సత్తయ్య ఆరోపించారు. అధికారులు తన ఇష్టమున్నవారికే అమ్మవారిని ప్రత్యేకంగా దర్శించుకునే అవకాశం ఇస్తున్నారని అన్నారు. చివరకు తమ అనుచరులు, తెలిసినవారు, వైసిపి కార్యకర్తలకు అమ్మవారి దర్శనం చేయించే భాగ్యం కూడా లేకుండా చేస్తున్నారని సత్తయ్య అన్నారు.
చివరకు పాలకమండలి సభ్యులను కూడా ఆలయ అధికారులు అడ్డుకుంటున్నారని సత్తయ్య ఆందోళన వ్యక్తం చేసారు. వెంటనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్, దేవాదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ, స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు తమకు జరుగుతున్న అవమానాలపై స్పందించాలని... వెంటనే తగిన గౌరవం దక్కేలా చూడాలని కోరారు. బోర్డు సభ్యులతో పాటు అమ్మవారి దర్శనం కోసం వచ్చే సామాన్య భక్తులు అధికారుల తీరుతో ఇబ్బంది పడుతున్నారని... వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆలయ బోర్డ్ మెంబర్ సత్తయ్య విజ్ఞప్తి చేసారు.
