Asianet News TeluguAsianet News Telugu

శ్రీకాళహస్తిలో మహిళా సీఐ తీరుపై జాతీయ మహిళా కమిషన్‌ సీరియస్‌.. చర్యలు తీసుకోవాలని డీజీపీకి లేఖ

శ్రీకాళహస్తిలో సీఐ అంజు యాదవ్‌ ప్రవర్తించిన తీరు ఇటీవల తీవ్ర విమర్శలకు దారితీసిన సంగతి  తెలిసిందే. ఓ మహిళపై అంజు యాదవ్ దాడి చేస్తున్న వీడియో వైరల్‌గా మారడంతో.. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. తాజాగా ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్నట్టుగా జాతీయ మహిళా కమిషన్ వెల్లడించింది. 

National Women commission serious on A video of Srikalahasti CI Anju Yadav attacking a woman
Author
First Published Oct 4, 2022, 12:53 PM IST

శ్రీకాళహస్తిలో సీఐ అంజు యాదవ్‌ ప్రవర్తించిన తీరు ఇటీవల తీవ్ర విమర్శలకు దారితీసిన సంగతి  తెలిసిందే. ఓ మహిళపై అంజు యాదవ్ దాడి చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. దీంతో ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష టీడీపీ నాయకులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనను టీడీపీ నాయకురాలు వంగలపూడి అనిత.. సోషల్ మీడియా వేదికగా జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన జాతీయ మహిళా కమిషన్.. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నట్టుగా వెల్లడించింది. 

ఈ ఘటనపై తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, తప్పు చేసిన పోలీసులను అరెస్ట్ చేయాలని సంబంధిత డీజేపీకి జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ లేఖ రాసినట్టుగా తెలిపింది. కమిషన్ ఈ విషయంలో కాలపరిమితితో కూడిన విచారణను, బాధితురాలికి ఉత్తమ వైద్య చికిత్సను అందించాలని కూడా కోరినట్టుగా తెలిపింది. 

ఇక, ఈ ఘటనపై ఏపీ పోలీసులను ప్రశ్నించిన వంగలపూడి అనిత.. కఠిన చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్‌ను కోరారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై పోలీసుల దౌర్జన్యాలు. మహిళా పోలీసులను ఉపయోగించి ప్రతిపక్ష పార్టీలకు చెందిన మహిళలపై క్రూరంగా దాడులు చేస్తున్నారు.దయ చేసి కఠిన చర్యలు తీసుకోండి’’ అని జాతీయ మహిళా కమిషన్‌, జాతీయ మానవ హక్కుల సంఘం లను ట్యాగ్ చేస్తూ అనిత ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. 

 


అసలేం జరిగిందంటే..?
శ్రీకాళహస్తి వన్ టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ అంజు యాదవ్.. ఒక నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు తన సిబ్బందితో కలిసిపట్టణంలోని రాంనగర్ కాలనీకి చేరుకున్నారు. అయితే అక్కడ అతడు లేకపోవడంతో..  అంజు యాదవ్ అతని భార్య ధనలక్ష్మిని ప్రశ్నించారు. ఆమెపై శారీరకంగా దాడి చేశారు. అతడు ఎక్కడ ఉన్నాడో సమాచారం చెప్పాలంటూ బెదిరింపులకు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.  ఆ వీడియోలో అంజు యాదవ్.. ధనలక్ష్మిని దూషిస్తూ, అక్కడే నిలిపి ఉన్న పోలీసు వాహనంలోకి బలవంతంగా ఎక్కించారు. అయితే సీఐ అంజు యాదవ్.. తనను తన్నినట్టుగా బాధిత మహిళ ధనలక్ష్మి ఆరోపించారు. తనకు ఇంతుకు ముందు ఆపరేషన్ జరిగినట్టుగా  చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios