న్యూఢిల్లీ: ఎయిడ్స్ వ్యాధి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటి వరకు 3.5కోట్ల మందికి పైగా ప్రాణాలను ఎయిడ్స్ వ్యాధి బలితీసుకుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలను ఉక్కిరిబిక్కిరి చేసిన ఎయిడ్స్ ఇప్పుడు ఏపీపై పంజా విసురుతోంది. హెచ్ఐవీ రోగులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. జాతీయ హెల్త్ ప్రొఫైల్ నివేదికలో ఈ అంశం వెల్లడైంది. 

హెచ్ఐవీ, ఎయిడ్స్ రోగులు అత్యధికంగా కలిగిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచిందని తెలిపింది. డిసెంబరు 2018 నాటికి దేశవ్యాప్తంగా 12.73 లక్షల మంది హెచ్ఐవీ, ఎయిడ్స్‌తో బాధపడుతున్నట్టు జాతీయ హెల్త్ ప్రొఫైల్ నివేదిక పేర్కొంది.

వీరిలో ఏకంగా 1.82 లక్షల మంది ఏపీలోనే ఉన్నారని తెలిపింది. ఫలితంగా ఈ జాబితాలో ఏపీ రెండో స్థానంలో నిలిచిందని తన నివేదికలో తెలిపింది. ఇకపోతే పొరుగు రాష్ట్రమైన తెలంగాణ ఐదోస్థానంలో నిలిచిందని తెలిపింది. తెలంగాణలో 78 వేల మంది ఎయిడ్స్ వ్యాధిబారిన పడినట్లు తెలిపింది.