ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ఏర్పాటుకు మద్ధతుగా నర్సీపట్నం వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ నేతృత్వంలో శనివారం భారీ బైక్ ర్యాలీ జరిగింది. ఈ క్రమంలో స్వయంగా బైక్ నడిపిన ఎమ్మెల్యే ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు.
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల ఏర్పాటుపై అధికార వైసీపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూ... మూడు రాజధానులు ఏర్పాటు చేయడం వల్ల లాభాలను వివరించే ప్రయత్నం చేస్తోంది. కొన్ని చోట్ల మూడు రాజధానులకు అనుకూలంగా వైసీపీ నేతలు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. తాజాగా నర్సీపట్నంలో వైసీపీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ నేతృత్వంలో శనివారం భారీ బైక్ ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో పాలుపంచుకున్న ఉమాశంకర్ గణేశ్... అందరినీ ఉత్సాహపరిచారు. అయితే ప్రమాదవశాత్తూ ఆయన బైక్ పైనుంచి కింద పడిపోవడంతో కాలికి తీవ్రగాలయ్యాయి.
ర్యాలీలో భాగంగా ఉమాశంకర్ నడుపుతున్న బైక్‌ను మరో బైక్ పక్క నుంచి ఢీకొట్టింది. దీంతో ఎమ్మెల్యే అదుపు తప్పి పడపోయారు. ఈ ప్రమాదంలో గణేశ్ కాలికి గాయం కావడంతో ఆయనను భద్రతా సిబ్బంది, అనుచరులు హుటాహుటీన ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యం చేయించుకున్న గణేశ్ మెరుగైన చికిత్స కోసం నర్సీపట్నంలోని మరో ఆసుపత్రికి వెళ్లారు. వైద్యులు ఆయన కాలికి శస్త్రచికిత్స చేయాలని చెప్పినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు... వికేంద్రీకరణకు మద్దతుగా ఉత్తరాంధ్రలో నిర్వహిస్తున్న సమావేశాల్లో మంత్రులు, వైసీపీ నాయకులు పాల్గొంటున్నారు. అమరావతి రైతులు చేపట్టిన పాదయాత్రను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే విశాఖ రాజధాని కోసం రాజీనామా చేయడానికి సిద్దమేనని ప్రకటనలు చేస్తున్నారు. శుక్రవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి హాజరైన మంత్రి ధర్మాన ప్రసాదరావు.. విశాఖకు రాజధాని రాకుండా చేసే వారిని శత్రువులుగా చూడాలని అన్నారు. సీఎం జగన్, ప్రజలు అనుమతిస్తే రాజీనామా చేసి ఉద్యమానికి వెళ్లిపోదామనే ఆలోచన ఉందని చెప్పారు.
ఇదిలా ఉండగా.. వికేంద్రీకరణకు మద్దతుగా రాజీనామాలకు సిద్దమని మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ నేడు ప్రకటించారు. వికేంద్రీకరణకు మద్దతుగా ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ అధ్యక్షతన వివాఖలోని హోటల్ మేఘాలయాలో శనివారం నాన్ పొలిటికల్ జేఏసీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, కరణం ధర్మశ్రీ, పలువురు ఫ్రొఫెసర్లు, డాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాజీనామాకు సిద్దంగా ఉన్నట్టుగా అవంతి శ్రీనివాస్, కరణం ధర్మశ్రీ ప్రకటించారు. కరణం ధర్మశ్రీ మరో అడుగు ముందుకు వేసి.. స్పీకర్ ఫార్మాట్‌లో ఉన్న తన రాజీనామా లేఖను జేఏసీ కన్వీనర్ లజపతిరాయ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా కరణం ధర్మశ్రీ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌గా అమరావతి రైతులు వ్యతిరేకిస్తే.. తాము కూడా అమరావతికి వ్యతిరేకమేనని అన్నారు. వికేంద్రీకరణ కోసం తాను రాజీనామాకు సిద్దమని ప్రకటించారు. దమ్ముంటే వికేంద్రీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేయాలని ఏపీ టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడుకు సవాలు విసిరారు. అమరావతికి మద్దతు నినాదంతో టెక్కలి నుంచి తిరిగి పోటీ చేయాలని అన్నారు.
