విశాఖపట్నం: విశాఖకు చెందిన అనస్తీషియన్‌ డాక్టర్ సుధాకర్ గుండెపోటుతో మరణించారు. నర్సీపట్నానికి చెందిన ఆయన పేరు నిరుడు కరోనా తొలి దశ సమయంలో వెలుగులోకి వచ్చింది. వైద్య సిబ్బందికి మాస్కులు లేవంటూ వ్యాఖ్యానించి సస్పెండయ్యారు. 

అక్కడికి కొద్దిరోజులకే విశాఖపట్నం జాతీయ రహదారిపై గొడవ చేస్తున్నారంటూ ఆయనను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం ఈ వ్యవహారం కోర్టుకూ చేరింది. కొద్దిరోజుల పాటు మానసిక వైద్యశాలలో చికిత్స తీసుకుని డిశ్చార్జి అయ్యారు.
 
ఆయన రెండేళ్లు నర్సీపట్నంలో వైద్యుడిగా సేవలందించారు. కరోనా మొదటి దశ వ్యాప్తి ఎక్కువగా ఉన్న సమయంలో నర్సీపట్నం పురపాలక కార్యాలయంలో ఎమ్మెల్యే ఉమాశంకర్‌ గణేష్‌ నిర్వహిస్తున్న సమీక్ష సమావేశానికి తనంత తానుగా ఆయన వచ్చారు. స

మావేశ మందిరంలోకి వెళ్లి తిరిగి బయటకు వచ్చిన తరవాత ఆయన ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యులకు ఎన్‌-95 మాస్కులు ఇవ్వడం లేదని.. ఒకటి ఇచ్చి పదిహేను రోజులు వాడుకోమని చెబుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించాయి. దీనిపై అధికారులు విచారణ నిర్వహించి ప్రాథమిక చర్యలకు సిఫార్సు చేశారు. ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా మాట్లాడారనే ఆరోపణపై ఆయనను సస్పెండ్‌ చేశారు. 

అప్పటి నుంచి ఆయన విధులకు దూరమై విశాఖలోనే ఉంటున్నారు. తదుపరి ఓ ఘటనలో విశాఖలో ఆయనపై పోలీసులు దురుసుగా ప్రవర్తించిన తీరు సంచలనమైంది. డాక్టర్‌ సుధాకర్‌పై కక్షకట్టినట్టు వ్యవహరించడాన్ని ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా అనేకమంది వ్యతిరేకించారు. సుధాకర్‌పై కొద్దిరోజుల క్రితమే నర్సీపట్నంలో శాఖాపరమైన విచారణ జరిగింది. దానికి ఆయన స్వయంగా హాజరై అధికారుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. 

అధికారులకు అన్ని విషయాలను వివరించానని, త్వరలోనే విధుల్లోకి తీసుకుంటారన్న ఆశాభావం విలేకరుల వద్ద వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగిగా సేవలు చేయడమే తనకు ఇష్టమని, ఎవరినీ కించపరిచే ఉద్దేశాలు లేవని చెప్పారు. రేపో, మాపో సుధాకర్‌ విధుల్లోకి వస్తారని పలువురు ఎదురు చూస్తున్న సమయంలో ఆయన మరణించారు.