ఈ నెల 16 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ను పంపిణీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి దేశవ్యాప్తంగా డ్రై రన్‌ను విజయవంతంగా నిర్వహించింది.

తొలిదశలో భాగంగా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు టీకా ఇస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌తో పాటు తొలిదశలోనే వ్యాక్సిన్‌ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Also Read:జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్: ముందుగా వారికే.. కేంద్రం ప్రకటన

వివిధ రాష్ట్రాల్లో కరోనా తీవ్రత, వ్యాక్సిన్‌ సన్నద్ధతలపై ప్రధాని శనివారం ఉన్నతస్థాయిలో సమగ్ర సమీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. అనంతరం ఈ నెల 16 నుంచి టీకా పంపిణీ చేస్తామని మోడీ వెల్లడించారు.

పండుగల సీజన్ కావడంతో వచ్చే శనివారం నుంచే వ్యాక్సిన్‌ వేయడం ప్రారంభించాలని ప్రధాని నిర్ణయించారు. తొలుత వైద్యులు, హెల్త్ వర్కర్లు, సఫాయి కర్మచారీలు సహా పలు వర్గాల వారికి ప్రాధాన్యం ఇస్తామని మోడీ తెలిపారు.

కరోనాపై పోరులో భాగంలో ప్రజల ప్రాణాలను కాపాడటంలో ముందు నిలుస్తున్న దాదాపు మూడు కోట్ల మందికి తొలి ప్రాధాన్యత ఇస్తారు. ఆ తర్వాత 50 ఏళ్లు పైబడినవారికి, 50 ఏళ్లలోపు వయసున్నా ఇతరత్రా అనారోగ్య సమస్యలున్నవారికి టీకా ఇవ్వనున్నారు.

వీరంతా కలిపి దాదాపు 27 కోట్ల మంది ఉంటారని ప్రభుత్వ అంచనా. వయసు నిర్థారణకు తాజా ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకోనున్నారు.