మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ ఫైర్ బ్రాండ్, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎన్నికల ముందు విశాఖ స్టీల్ ప్లాంట్‌పై పార్లమెంట్‌లో.. వైసీపీ ఎంపీలు ప్రశ్నలు అడిగి సెల్ఫ్‌గోల్‌ వేసుకున్నారంటూ ఎద్దేవా చేశారు.

ఇప్పుడు మళ్లీ ప్రశ్నలు అడిగి ఆర్థికమంత్రితో.. నెగటివ్‌ సమాధానం చెప్పించుకున్నారని  రఘురామ విమర్శించారు. రాష్ట్రాన్ని సంప్రదించామని కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ స్పష్టంగా చెప్పారని.. ఆర్ధిక మంత్రి సమాధానం చూస్తే.. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఎవరూ ఓటేయరని అర్ధమవుతోందని ఆయన జోస్యం చెప్పారు.

సలహాదారులకే సలహాలిచ్చే సీఎం జగన్‌కు 100 మంది సలహాదారులు అవసరమా? అని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. జగన్ జైలుకెళ్తే పదవి దక్కించుకోవాలని కుట్ర అన్న.. రిపబ్లిక్ టీవీ కథనాలను తేలిగ్గా కొట్టిపడేయటానికి లేదని రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు.

కాగా, విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన సంచలన ప్రకటన కలకలం రేపింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదని ఆమె తేల్చి చెప్పారు.

లోక్‌సభలో విశాఖపట్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.