నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజ్‌కు చెందిన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. కాలేజ్ హాస్టల్ గదిలో ఆమె బలవన్మరణం చెందినట్టుగా పోలీసులు తెలిపారు.
నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజ్‌కు చెందిన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. కాలేజ్ హాస్టల్ గదిలో ఆమె బలవన్మరణం చెందినట్టుగా పోలీసులు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న మెడికోను శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన చైతన్యగా గుర్తించారు. చైతన్యకు ప్రస్తుతం నారాయణ మెడికల్ కాలేజ్ హాస్టల్ ఉంటూ హౌస్ సర్జన్‌గా చేస్తోంది. చైతన్యకు రెండు నెలల క్రితమే విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తితో పెళ్లి జరిగింది. అయితే ఏమైందో తెలియదు గానీ.. ఆమె హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది.
ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు నారాయణ మెడికల్ కాలేజ్ హాస్టల్ వద్దకు చేరుకుని.. చైతన్య ఆత్మహత్య చేసుకున్న చోటును పరిశీలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చైతన్య ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆమె చివరిగా తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. దాంపత్య జీవితంలో కలహాల వల్లే చైతన్య ఆత్మహత్య చేసుకున్నట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇక, ఈ ఘటనపై సమాచారం అందుకున్న చైతన్య తల్లిదండ్రులు.. పల్నాడు నుంచి నెల్లూరుకు బయలుదేరారు. వారు ఈరోజు మధ్యాహ్నానికి నెల్లూరు చేరుకునే అవకాశం ఉంది.
(జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.)
