నారా లోకేష్ యువగళం పాదయాత్ర పునఃప్రారంభ తేదీ వాయిదా..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పునఃప్రారంభ తేదీ వాయిదా పడింది.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పునఃప్రారంభ తేదీ వాయిదా పడింది. ఈ ఏడాది జనవరి చివర్లో యువగళం పేరుతో నారా లోకేష్ పాదయాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల టీడీపీ అధినేత, తన తండ్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో లోకేష్ పాదయాత్రను వాయిదా వేశారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత కొద్దిరోజులకు ఢిల్లీ వెళ్లిన లోకేష్.. అక్కడి నుంచి పార్టీ ముఖ్య నేతలతో చర్చలు జరుపుతున్నారు. పలు జాతీయ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ నెల 26న రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా కలిసి.. చంద్రబాబు అరెస్ట్ అంశాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లారు.
అయితే సెప్టెంబరు 29న రాత్రి 8.15 గంటలకు లోకేష్ పాదయాత్ర తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే తాజాగా పాదయాత్ర పునఃప్రారంభ తేదీని వాయిదా వేయాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై అక్టోబర్ 3వ తేదీన సుప్రీం కోర్టులో విచారణ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెబుతున్నారు. లోకేష్ ఢిల్లీలోనే ఉండి న్యాయవాదులతో సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందనే పార్టీ ముఖ్య నేతలు ఆయనకు సూచించినట్టుగా తెలుస్తోంది. లోకేష్ పాదయాత్రలో ఉంటే.. న్యాయవాదులతో సంప్రదింపులు, ఇతర కార్యక్రమాల పర్యవేక్షణ కష్టం అవుతుందని టీడీపీ నేతలు భావిస్తున్నట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీం విచారణ తర్వతే.. లోకేష్ పాదయాత్ర ప్రారంభంపై ఓ స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక, ఇప్పటికే చంద్రబాబను అక్రమంగా అరెస్ట్ చేశారని టీడీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు లోకేష్‌ను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది.