Asianet News TeluguAsianet News Telugu

పది, ఇంటర్ పరీక్షల రద్దు... హోంమంత్రి అమిత్ షాకు లోకేష్ లేఖ

దేశంలోని దాదాపు 14 రాష్ట్రాలతో పాటు ఐసిఎస్‌ఈ, సిబిఎస్‌ఈ బోర్డులు పరీక్షలు రద్దు చేయగా ఏపీలో మాత్రం ఇందుకు విరుద్ధంగా చర్యలు ఉన్నాయని నారా లోకేష్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు.  

nara lokesh writes a letter to  Union Home Minister Amit Shah akp
Author
Amaravathi, First Published May 25, 2021, 4:56 PM IST

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కరోనా సెకండ్ వేవ్ విజృంభణ సమయంలో విద్యార్థులకు పరీక్షల నిర్వహించాలన్న నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరీక్షలు రద్దు చేయాలని పలుమార్లు కోరినా జగన్ సర్కార్ పట్టించుకోలేదు. దీంతో మరో అడుగు ముందుకేసిన లోకేష్ తాజాగా రాష్ట్రంలో పది, ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల రద్దుకు కేంద్రం జోక్యం కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. 

''దేశంలోని దాదాపు 14 రాష్ట్రాలతో పాటు ఐసిఎస్‌ఈ, సిబిఎస్‌ఈ బోర్డులు పరీక్షలు రద్దు చేశాయి. ఏపీలో మాత్రం ఇందుకు విరుద్ధంగా చర్యలు ఉన్నాయి. జూన్ 7వ తేదీ నుంచి వేలాది పరీక్షా కేంద్రాల్లో 6.7 లక్షల మంది విద్యార్థులకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది'' అని తన లేఖలో పేర్కొన్నారు.

''దాదాపు 5లక్షలకు పైగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులు తమ పరీక్షల పట్ల అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. గత ఏడాది మార్చి నుంచి ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చిన విద్యార్థులు పరీక్షలు రాసేందుకు సిద్ధంగా లేరు. కానీ ప్రభుత్వం మాత్రం పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపుతుండటంతో ఈ రెండు తరగతుల విద్యార్థులు ఎంతో  మానసిక ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు'' అని లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. 

read more  తెలంగాణను చూసైనా.. ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలి.. నారా లోకేష్

''అనవసరంగా మరింత మందిని కరోనా రెండో దశ ఉధృతికి పరీక్షల వంకతో ఫణంగా పెట్టడం తగదు. లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి పరీక్షలు వద్దని అభ్యర్థనలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. పరీక్షల నిర్వహణతో విద్యార్థులను సూపర్‌స్ప్రెడర్ లుగా మార్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ఉన్నాయి'' అన్నారు.

''ఆన్లైన్ ద్వారా నేను విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో నిర్వహించిన దశల వారీ సమావేశాలు, అభిప్రాయ సేకరణలో పరీక్షల రద్దుకు 5లక్షల మందికి పైగా మద్దతు పలికారు. పది, ఇంటర్  పరీక్షల విషయం లో సిబిఎస్ఈ అనుసరిస్తున్న విధానాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేసేలా చర్యలు తీసుకోనేలా చూడండి'' అని అమిత్ షాను కోరారు లోకేష్.

''ఏపీలో 20శాతం కంటే ఎక్కువగా కరోనా పాజిటివ్ రేటు నమోదవుతుంటే పరీక్షలు నిర్వహణ తగదు. విద్యార్థులు, ఉపాధ్యాయులను బాధించేలా 3వ దశ ఉధృతి హెచ్చరికలు ఉన్నాయి. ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల ఆందోళనలను  గమనించి విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం నిర్ణయం తీసుకోవాలి'' అని లోకేష్ కేంద్ర మంత్రి అమిత్ షాను కోరారు. 

Follow Us:
Download App:
  • android
  • ios