ఆంధ్ర ప్రదేశ్ లో గురువారం అసెంబ్లీతో పాటు లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో తీవ్ర ఎండను సైతం లెక్కచేయకుండా ఇళ్లలోంచి బయయటకు వచ్చి మహిళలు, వృద్దులు ఓటింగ్ శాతం పెరిగేలా చేశారని సీఎం తనయుడు నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. వీరంతా సరైన అభ్యర్థులకే  మద్దతిచ్చారన్నారు. ఏపి ఓటర్లు  చాలా తెలివైనవారని...వారిని మోసగించడం ఎవరితరం కాదని లోకేశ్ పేర్కొన్నారు. 

ఏపిలో జరిగిన పోలింగ్ గురించి లోకేశ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. '' ఏపిలోని మహిళలు, వృద్దులు ఓటేయడానికి ఎండను సైతం లెక్కచేయకుండా కదిలారు. ఈవీఎంలు మొరాయిస్తున్నప్పటికి గంటల తరబడి క్యూలోనే నిలబడి వారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇలా వారు అభిమాన నాయకుడు చంద్రబాబుకు సొంత కుటుంబం మాదిరిగా మద్దతుగా నిలబడ్డారు. వారి గురించి మాట్లాడటానికి మాటలు రావడం లేదు. థ్యాంక్యూ...మద్దుతుగా నిలిచి ఓటేసిన వారందరికి హ్యట్సాఫ్ '' అంటూ  లోకేశ్ ట్వీట్ చేశారు. 

మరో ట్వీట్ లో  '' ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ తమ ఓటుహక్కును వినియోగించుకున్న ప్రతి పౌరుడికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు. ఈ ఎన్నికలు మంచికి, చెడుకు మధ్య జరిగాయి. ప్రజలు మంచి వైపే నిలబడ్డారని తాను నమ్ముతున్నాను'' అని లోకేశ్ పేర్కొన్నారు.