మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర సతీమణి జ్యోతిర్మయిని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫోన్లో పరామర్శించారు.  

కరోనా విజృంభిస్తున్న సమయంలో 400 మంది పోలీసులు ఇంట్లోకి ప్రవేశించి భయానక వాతావరణం సృష్టించారని జ్యోతిర్మయి ఆవేదన వ్యక్తం చేశారు. విచారణకు సిద్ధం అని,  అన్ని విధాలా సహకరిస్తామని చెప్పినా ఒక యుద్దవాతావరణం సృష్టించి అరెస్ట్ చేసారని లోకేష్ కి జరిగిన సంఘటనలను  జ్యోతిర్మయి వివరించారు.

అయితే ఫోన్ లో జ్యోతిర్మయిని ఓదార్చిన లోకేష్ ధూళిపాళ్ల కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని చెప్పారు. ధూళిపాళ్ల పై పెట్టిన అక్రమ కేసుల్లో జగన్ రెడ్డికి,వైకాపా యూనిఫామ్ వేసుకున్న కొంతమంది అధికారులకు కోర్టులో చివాట్లు ఖాయమని లోకేష్ అన్నారు.

ఇదిలా ఉండగా శుక్రవారం ఉదయం తెలుగుదేశం పార్టీ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్రను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్న సంగత తెలిసిందే. ధూళిపాళ్ల నరేంద్రను అరెస్టు చేసి బాపట్లకు తరలించినట్లు తెలుస్తోంది. శుక్రవారం తెల్లవారు జామునే నరేంద్ర ఇంటి వద్ద వంద మందికి పైగా పోలీసులు మోహరించారు. 

టీడీపీ నేత దూళిపాళ్ల నరేంద్ర అరెస్టు, బాపట్లకు తరలింపు...

గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడిలో ధూళిపాళ్ల నరేంద్రను ఎసీబీ అధికారులు అరెస్టు చేశారు. కారణం చెప్పకుండా నరేంద్రను అరెస్టు చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసులు ఎందుకు అరెస్టు చేశారో తెలియక నరేంద్ర కుటుంబ సభ్యులు అయోమయంలో పడ్డారు. 

ధూళిపాళ్ల నరేంద్ర ప్రస్తుతం సంగం డెయిరీ చైర్మన్ గా ఉన్నారు. సంగం డెయిరీలో అవకతవకలపై ఆరోపణలు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆ విషయంపై విచారణ నిమిత్తం నరేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు భావిస్తున్నారు.