అమరావతి: రాజధాని అమరావతి రైతుల ఆందోళనకు మద్దతుగా ఓ విద్యార్థి రూపొందించిన వీడియోను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఉద్దేశించి ఓ విద్యార్థి తన మాటలను వీడియో రికార్డింగ్ చేశాడు. 

అమరావతి నుంచి రాజధానిని తరలించవద్దంటూ చేపట్టిన ఆందోళన గురువారంనాడు 30వ రోజుకు చేరుకుంది. ఈ ఆందోళనలో రైతులు, మహిళలు మాత్రమే కాకుండా తమ తల్లిదండ్రులకు మద్దతుగా విద్యార్థులు కూడా పాల్గొంటున్నారు. 

ఈ ఆందోళన నేపథ్యంలో ఓ విద్యార్థి మాట్లాడిన మాటల వీడియోను నారా లోకేష్ ట్వీట్ చేశారు.ఆ వీడియోను ట్వీట్ చేస్తూ.. "రాష్ట్రాభివృద్ధి, రాజధాని అమరావతి గురించి రాష్ట్ర యువత చెబుతున్నారు... వీలైతే ఒక్కసారి వినండి" అని లోకేష్ కోరారు. "మంచి వినం, చూడం, మాట్లాడం అంటే మీ ఇష్టం జగన్ గారూ..." ఆయన పోస్టు పెట్టారు. 

వీడియోలో... "సీఎం జగన్ గారు డమ్మీ కాన్వాయ్ లో తిరుగుతున్నారు. దమ్ముంటే, ఒక రోజైనా రాజధాని గ్రామాల్లో పర్యటించండి. అమరావతి రాజధానిగా... చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు... వైజాగ్ అభివృద్ధి కాలేదా... కియా రాలేదా... శ్రీసిటీ రాలేదా... ఉన్నది ఉంచుకోవడం చేత కాదు కానీ... మాకు చెబుతారు నీతులు" విద్యార్థి వ్యాఖ్యానించారు.