రెండేళ్ళ కన్నకూతురు చనిపోతే ఆ బాధను దిగమింగుకుంటూ తండ్రే మృతదేహాన్ని భుజానేసుకుని బైక్ పై ఇంటికి తరలించిన హృదయవిదారక ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.
నెల్లూరు: మొన్న తిరుపతిలో రుయా హాస్పిటల్ లో, నిన్న నెల్లూరు జిల్లాలో వైద్యసిబ్బంది నిర్లక్ష్యంతో కన్న తండ్రులే తమ బిడ్డల మృతదేహాలను బైక్ తరలించిన హృదయవిదారక ఘటనలు వెలుగుచూసాయి. వీటిని మరిచిపోకముందే మరోసారి నెల్లూరు జిల్లాలో అలాంటి సంఘటనే చోటుచేసుకుంది. 108 అంబులెన్స్ లో మృతదేహాన్ని తరలించడానకి సిబ్బంది ఒప్పకోకపోవడంతో కన్నకూతురు మృతదేహాన్ని భుజానేనేసుకుని బైక్ పై తరలించాడు ఓ తండ్రి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దృష్టికి వెళ్ళాయి. దీంతో ఆయన వైసిపి ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై విరుచుకుపడ్డారు.
''కుళ్లు, కుతంత్రాలతో తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మాట్లాడడం వల్ల మీకు, మీ నాయకులకు ఆత్మసంతృప్తి కలగొచ్చేమో కానీ ప్రజలకు ఎటువంటి ఉపయోగం ఉండదు జగన్ రెడ్డి గారు. మీరు మాపై అక్కసుతో మాట్లాడుతున్న సందర్భంలోనే అంబులెన్స్ మాఫియా ఆగడాలు తట్టుకోలేక తిరుపతి జిల్లా నాయుడుపేటలో రెండేళ్ల చిన్నారి మృతదేహాన్ని బైక్ పై సొంత ఊరికి తీసుకెళ్ళాడు ఓ తండ్రి. ఆసుపత్రి సిబ్బంది సహకరించక, అంబులెన్స్ మాఫియా డిమాండ్ చేసిన డబ్బు లేక చిన్నారి అక్షయ మృతదేహాన్ని 18 కి.మీ బైక్ పై సొంత గ్రామం కొత్తపల్లి కి తీసుకెళ్లాల్సిన దయనీయ పరిస్థితిని కల్పించింది వైసిపి ప్రభుత్వం. ఫ్రస్ట్రేషన్ పక్కన పెట్టి పని పై దృష్టి పెట్టండి. కాస్తయినా పరిస్థితులు మెరుగుపడతాయి'' అని లోకేష్ సూచించారు.
చిన్నారి మృతికి సంబంధించిన వివరాలు:
నెల్లూరు జిల్లా దొరవారి సత్రం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన దంపతులకు అక్షయ(2), శ్రవంత్ (5) సంతానం. ప్రస్తుతం స్కూళ్లకు వేసవి సెలవులు వుండటంతో చిన్నారులిద్దరూ ఇంటివద్దే వుంటున్నారు. ఈ క్రమంలోనే నిన్న(గురువారం) ఆడుకుంటూ వెళ్లి గ్రామ శివారులోని గ్రావెల్ గుంటలో పడి అన్నాచెల్లెల్లిద్దరూ నీటమునిగారు. వీరిని గమనించిన ఓ గొర్లకాపరి వెంటనే నీటిలోకి దిగి శ్రవంత్ ను ప్రాణాలతో కాపాడాడు. చిన్నారి మాత్రం చాలాసేపటి వరకు నీటిలోనే వుండటంతో తీవ్ర అస్వస్థతకు గురయింది.
అక్షయ పరిస్థితి విషమంగా వుండటంతో తల్లిదండ్రులు తిరుపతి జిల్లా నాయుడుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే హాస్పిటల్ కు చేరేలోపే చిన్నారి మృతిచెందింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే కూతురి మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు ప్రయత్నించారు. ప్రైవేట్ అంబులెన్స్ లో తరలించే ఆర్థిక స్థోమత లేని ఆ తల్లిదండ్రులు 108 అంబులెన్స్ సిబ్బంది సహాయం కోరారు. కానీ నింబంధనల పేరుతో చిన్నారి మృతదేహాన్ని తరలించేందుకు సిబ్బంది అంగీకరించలేదు.
ప్రభుత్వ అంబులెన్స్ సిబ్బంది సహయం చేయక, ప్రైవేట్ వాహనాల్లో తరలించే స్థోమత లేక నిస్సహాయస్థితిలో ఆ తండ్రి కన్నీటిని దిగమింగుతూ కూతురు మృతదేహాన్ని బైక్ పై ఇంటికి తరలించాడు. ఒకరు బైక్ డ్రైవ్ చేస్తుండగా వెనకాల కూతురు మృతదేహాన్ని భుజానేసుకుని తండ్రి కూర్చుకున్నాడు. ఇలా దాదాపు 18 కిలోమీటర్లు బైక్ పై ప్రయాణించి ఇంటికి చేర్చారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో వైద్య సిబ్బంది తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
