నరసరావుపేట: కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా కరోనా కేసులు పెరుగుదలపై మమ్మల్ని నిందించడం ఏంటని ప్రశ్నించిన గిరిజన అధికారిపై చర్యలు తీసుకోవడం దారుణమని మాజీ మంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా లోకేష్ అన్నారు. గిరిజన అధికారిపై జగన్ రెడ్డి ప్రభుత్వం దౌర్జన్యకాండకు దిగిందన్నారు. 

గుంటూరు జిల్లా నరసరావుపేటలో కరోనాపై జరిగిన సమీక్షా సమావేశంలో నాదెండ్ల వైద్యాధికారి సోమ్లూ నాయక్ ని చులకన చేసి మాట్లాడటమే కాకుండా అరెస్ట్ చెయ్యడం జరిగిందన్నారు. క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలు లేవనెత్తి ప్రభుత్వాన్ని నిలదీసిన గిరిజన అధికారిపై వైకాపా ప్రభుత్వం జులుం ప్రదర్శించడం ఘోరమన్నారు. ఆయన అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. 

''గతంలో మాస్క్ అడిగినందుకు దళిత డాక్టర్ సుధాకర్ పై పిచ్చివాడనే ముద్ర వేసారు. ఇప్పుడు గిరిజన అధికారిని దౌర్జన్యంగా అరెస్ట్ చేసారు.  కరోనా వ్యాప్తికి కారణం అయిన వైకాపా ఎమ్మెల్యేలు, కరోనా పెద్ద విషయం కాదన్న జగన్ రెడ్డి పై చర్యలు తీసుకోకుండా ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేస్తున్న వైద్య సిబ్బందిని వేధిస్తున్నారు. తక్షణమే అరెస్ట్ చేసిన సోమ్లూ నాయక్ ని విడుదల చెయ్యాలి'' అని లోకేష్ డిమాండ్ చేశారు.