ఆంధ్ర ప్రదశ్ లో కొందరు వైసిపి నాయకులు, వాలంటీర్లు, పోలీసులు అరాచకాలు సృష్టింస్తున్నారని నారా లోకేష్ ఆరోపించారు. కర్నూలు జిల్లా గూడూరు మండలం గుడిపాడులో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనమన్నారు.
అమరావతి: తమ ఇంటిముందున్న ఖాళీ స్థలాన్ని ప్రభుత్వాధికారులు స్వాధీనం చేసుకోవడాన్ని అడ్డుకున్న తల్లిబిడ్డలతో పోలీసులు అమానవీయంగా ప్రవర్తించిన ఘటన కర్నూల్ జిల్లాలో వెలుగుచూసింది. తమ స్థలాన్ని రెవెన్యూ సిబ్బంది ప్రభుత్వ స్థలంగా పేర్కొంటూ స్వాధీనం చేసుకుంటుండగా ఇద్దరు కూతుళ్లతో కలిసి తల్లి అడ్డుకునే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే ఇద్దరు యువతులను మహిళా పోలీసులు తమ చున్నీలతో కట్టేయడంపై వివాదంగా మారుతోంది. ఈ ఘటనపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీరియస్ అయ్యారు.
''మీరు, మీ పార్టీ నేతలు, పోలీసులు, వాలంటీర్లు చేస్తున్న అరాచకాల్నించి రక్షించే యాప్ ఏదైనా వుంటే ఆరంభించండి సీఎం సారూ! కర్నూలు జిల్లా గూడూరు మండలం గుడిపాడులో మహిళా పోలీసుల అమానవీయ ప్రవర్తనతో సభ్యసమాజం తల దించుకుంది. తన ఇంటిముందు స్థలాన్ని పోలీసులతో వచ్చిన రెవెన్యూ సిబ్బంది స్వాధీనం చేసుకుంటుండగా మీనాక్షమ్మ, ఆమె కుమార్తె అడ్డుపడ్డారు. సాటి మహిళలు అని కూడా చూడకుండా మహిళా పోలీసులు తమ చున్నీలతో బంధించడం మీ అరాచక పాలనలో మరో అమానవీయ ఘటన. దుర్మార్గ ప్రభుత్వ తీరును ప్రజలంతా ఒక్కటై నిలదీయాల్సిన సమయం ఆసన్నమైంది. ఇంకెన్నాళ్లీ దౌర్జన్య పాలన?'' అంటూ లోకేష్ మండిపడ్డారు.
రాష్ట్రంలోని అధికారులపై అవినీతికి సంబంధించిన ఫిర్యాదులను నమోదు చేయడానికి మరియు నిర్ధారించడానికి అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ) రూపొందించిన '14400' యాప్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల ప్రారంభించారు. ఈ క్రమంలోనే వైసిపి నేతలు, వాలంటీర్లు, పోలీసుల అరాచకంగా వ్యవహరిస్తున్నారంటూ కర్నూల్ జిల్లాలో యువతులను నిర్బంధించిన ఘటనను గుర్తుచేసారు లోకేష్. వీరిని నియంత్రించే యాప్ ఏదైనా వుంటే ప్రారంభించడండి అంటూ లోకేష్ ఎద్దేవా చేసారు
''దేశంలోనే అత్యంత అవినీతి పరుడై సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కొంటోన్న జగన్‌రెడ్డి అవినీతిని అరికడదామంటూ యాప్ ఆవిష్కరించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. యాప్‌కి 14400 నెంబర్ కాకుండా 6093 అయితే యాప్ట్‌గా ఉండేది. అవినీతి చూస్తూ ఉండొద్దు, అవినీతి గురించి వింటూ ఉండొద్దు, అవినీతికి వ్యతిరేకంగా గొంతు విప్పండి అంటూ లెక్చర్ ఇస్తోన్న అవినీతి అనకొండ వైఎస్ జగన్ గారూ... అవినీతిపై ఈ నేతిబీర కబుర్లు మాని మీపై ఉన్న అవినీతి కేసులు విచారణ త్వరితగతిన పూర్తి చెయ్యాలని కోరే దమ్ముందా?'' అంటూ లోకేష్ నిలదీసారు.
ఇదిలావుంటే ఇదే కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్న మరో దారుణంపై లోకేష్ స్పందించారు. ''వైసీపీ అరాచకాలకి వెల్దుర్తి ఘటన పరాకాష్ట. కర్నూలు జిల్లా వెల్దుర్తి అనకాల వీధికి అడ్డంగా వైసీపీ నాయకుడు సమీర్ రెడ్డి గోడ కడుతుండగా స్థానికులు అడ్డుకోవడాన్ని తట్టుకోలేక వారిపైనే దాడిచేయడం దారుణం. మహిళలు, పిల్లలని చూడకుండా సీసాలు, రాళ్లతో కొట్టడం వైసీపీ నేతల రాక్షస ప్రవృత్తికి నిదర్శనం'' అని మండిపడ్డారు.
''నలుగురు నడిచే రోడ్డుకడ్డంగా గోడ కట్టడమేంట్రా గాడిదా అని ఒక్క వైసీపీ నేతయినా సమీర్ రెడ్డికి గడ్డి పెట్టగలరా? సినిమాల్లో విలన్ల మాదిరి వైసీపీ నేతలు రెచ్చిపోతుంటే.. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడం మన దౌర్భాగ్యం'' అంటూ లోకేష్ మండిపడ్డారు.
