నిజాలను ప్రజలకు తెలియజేస్తున్న విలేకరుల వీపులు మోగడం కాదు నాలుగుకోట్ల ఆంధ్రులే మీ వీపులు విమానంమోత మోగించడం ఖాయమని కర్నూల్ మేయర్ ను నారా లోకేష్ హెచ్చరించారు.
కర్నూల్: బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులు నిర్వహిస్తున్న సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో అసలు ప్రజలే లేరంటూ తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని... అలాంటి విలేకరుల వీపులు వాయగొడతాం అంటూ కర్నూల్ మేయర్ బీవై రామయ్య హెచ్చరించడం రాజకీయ దుమారం రేపుతోంది. నిజాలు రాస్తున్న విలేకరులను వైసిపి నేత బెదిరించడమేంటని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.
వైసీపీ సామాజిక న్యాయభేరీకి జనాలు రారు... ఒకవేళ అధికారాన్ని, అధికారులను ఉపయోగించుకుని బ్రతిమాలో, బెదిరించో తెచ్చుకున్న కొందరు కూడా అసలు సమయానికి పారిపోతున్నారని లోకేష్ అన్నారు. ఇదే విషయాన్ని వివరిస్తూ వాస్తవాలు రాసేవారిని, చూపించే మీడియా ప్రతినిధుల వీపు వాయగొడతారా మేయర్ గారు! ఇదేం రౌడీయిజం? అని లోకేష్ నిలదీసారు.
అధికారంలో వున్నాం కదా అని మత్తులో ఇష్టంవచ్చినట్లు నోరు పారేసుకోవద్దు... వీపులు మీడియా వాళ్లకే కాదు, మీకూ వుంటాయని కర్నూల్ మేయర్ ను లోకేష్ హెచ్చరించారు. ఎప్పుడు మీ వీపులు విమానం మోత మోగిద్దామా అని నాలుగు కోట్లకి పైగా వున్న ఏపీ ఓటర్లు ఎదురు చూస్తున్నారని అన్నారు. మర్యాదగా మీడియా ప్రతినిధులకి క్షమాపణ చెప్పాలని బీవై రామయ్యకు లోకేష్ సూచించారు.
Video
వైసీపీ ప్రభుత్వం మూడేళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా నిన్న (సోమవారం) కర్నూలులోని పార్టీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కర్నూల్ మేయర్ బీవై రామయ్య మొదట దివంగత వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విలేకరులను బెదిరించేలా మాట్లాడారు.
''సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర వచ్చిన సమయంలో మధ్యాహ్నం ఎండ ఉందని నీడచాటుకు ప్రజలు వెళ్లారు... ఇదే సమయంలో ఖాళీగా వున్న కుర్చీల ఫోటోలు తీసి ఎవరూ లేరు అంటూ కొన్ని పత్రికలు పనిగట్టుకుని ప్రచారం చేశాయి. ఆ పత్రికల విలేకరుల వీపులు వాయగొడతాం జాగ్రత్త..'' అని కర్నూలు మేయర్ బీవై రామయ్య విలేకరులను హెచ్చరించారు.
ఇదిలావుంటే తండ్రి చంద్రబాబు బాటలోనే మరోసారి టిడిపిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు లోకేష్ పాదయాత్రకు సిద్దమయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చందరబాబు గాంధీ జయంతి రోజున అనంతపురం జిల్లా హిందూపురంలో పాదయాత్ర ప్రారంభించారు కాబట్టి అదే రోజున లోకేష్ కూడా పాదయాత్ర ప్రారంభిస్తే బావుంటుందని టీడీపీ శ్రేణులు కోరుతున్నాయి.
ప్రస్తుతం మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో లోకేష్ పర్యటిస్తున్నారు. ఈ కార్యక్రమం పూర్తి చేసిన తర్వాత పాదయాత్ర చేయాలని భావిస్తున్నారు. పాదయాత్ర ప్రారంభిస్తే మధ్యలో ఎక్కడా బ్రేక్ ఇవ్వకుండా కొనసాగించాలలని లోకేష్ భావిస్తున్నారు. పాదయాత్ర ప్రారంభించడానికి ముందే ఇతరత్రా కార్యక్రమాలను పూర్తి చేయాలని లోకేష్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారని టిడిపి వర్గాలు చెబుతున్నాయి.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. వైసీపీ మాత్రం ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం లేదని చెబుతుంది., టీడీపీ మాత్రం ఏపీలో ముందస్తు ఎన్నికలుంటాయని పదే పదే చెబుతుంది. ఈ నేపథ్యంలోనే పాదయాత్రను వీలైనంత త్వరగా ప్రారంభించాలని లోకేష్ భావిస్తున్నారని తెలుస్తోంది..
