ఏపీలో మద్యపాన నిషేధానికి తూట్లుపొడుస్తూ మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మందుబాబులను తాకట్టుపెట్టి అప్పులు తెచ్చారని నారా లోకేష్ ఆరోపించారు. 

అమరావతి: రాష్ట్రంలో మధ్యపాన నిషేధాన్ని అమలుచేస్తానని హామీఇచ్చి ఏపీ ముఖ్యమంత్రి పీఠమెక్కిన వైఎస్ జగన్ (ys jagan) ఇప్పుడు అదే మద్యంపై ఆదారపడి పాలన సాగిస్తున్నారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (nara lokesh) ఆరోపించారు. తాజాగా మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని చూపించి రాష్ట్ర ప్రభుత్వం రూ.8,300 కోట్లు రుణం తీసుకోవడాన్ని లోకేష్ తప్పుబట్టారు. తెలుగు దినపత్రికలో వచ్చిన వార్తను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ జగన్ సర్కార్ పై లోకేష్ విరుచుకుపడ్డారు.

''బూమ్ బూమ్ రెడ్డి బుస్సు మాటలు, మోసాలకు అడ్డూ అదుపూ లేదు. ఎన్నికల ముందు మద్యపాన నిషేధం ఎన్నికల తరువాత సంపూర్ణ మద్యపాన ప్రదేశ్. మద్యపాన నిషేధం అనే ఊసు కూడా ఎత్తేది లేదంటూ రాసిచ్చి మరీ, మందు బాబుల్ని తాకట్టు పెట్టి రూ.8300 కోట్ల అప్పు తెచ్చారు. జగన్ బ్రాండ్లతో ఎన్ని వేల మంది మహిళల మెడలో తాళ్లు తెగబోతున్నాయో ఆలోచిస్తేనే భయం వేస్తుంది'' అంటూ లోకేష్ ఆందోళన వ్యక్తం చేసారు. 

టీడీపీ మహిళా నేత గద్దె అనురాధ కూడా సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. జనం ఏమైతే నాకేంటి... తాను బాగుంటే చాలు అని ముఖ్యమంత్రి జగన్ అనుకుంటున్నారని అన్నారు. రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్, మరణాంధ్రప్రదేశ్ గా మార్చారని అనురాధ మండిపడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 230 నాటుసారా మరణాలు సంభవించగా.. శానిటైజర్ తాగి 52మంది మరణించారని... ఇక జగన్ ప్రభుత్వం సరఫరా చేస్తున్న నాసిరకం బ్రాండ్లు తాగి కిడ్నీలు, కాలేయం, గుండె పాడుచేసుకుంటున్న వారి సంఖ్య కోకొల్లలుగా ఉంటోందని అనురాధ ఆందోళన వ్యక్తం చేసారు. 

''కరోనా సమయంలో మద్యం కొనుగోలు శక్తి తగ్గిపోయి ఏం చేయాలో తోచక ఉన్న కొద్దిపాటి ఆదాయంతో తమ బిడ్డల కడుపు నింపడానికి అష్టకష్టాలు పడ్డారు. ప్రభుత్వం ఏవిధంగా వారికి సహాయం చేయలేదు. మద్యం రేట్లను అధికంగా పెంచి మద్యం బాబులపై బాదుడు బాదారు. దశలవారీగా మద్యపాన నిషేధాన్ని ప్రకటిస్తాం అని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి మడమ తిప్పి మద్యం బాబులను తాకట్టు పెట్టారు'' అని అనురాధ పేర్కొన్నారు. 

''మందుబాబులు నాణ్యతలేని మందు తాగడంతో ఆ మందు నాడీ మండలంపై పనిచేయడంతో అనేక కుటుంబాలు కడతేరడం చాలా బాధకరం. రాష్ట్రంలో అదుపులేని పాలన సాగుతోంది. పిచ్చి, కల్తీ సారా తాగడంతో ప్రజల ఒళ్లు గుల్ల అవుతోంది. ప్రభుత్వ సహకారంలేక పిల్లల్ని పోషించలేక మహిళలు పడే బాధ వర్ణనాతీతం. చుక్క వేయకపోతే జీతాలు లెక్క వేయలేము అని ప్రభుత్వం నీచమైన జీతాల లెక్కలు చెప్పడం బాధాకరం. మద్యం తాగితేనే మేం సంక్షేమ పథకాలు అందించగలమని చెప్పడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం. జగన్ రెడ్డి చెప్పేదంతా మోసం... చేసేదంతా అబద్దం అని మరోసారి రుజువైంది'' అన్నారు. 

''మద్యపాన నిషేదం చేస్తానని నాడు మహిళల ఓట్లు దండుకున్న జగన్ రెడ్డి నేడు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యపాన నిషేదం చేయబోమంటూ చెప్పి లిక్కర్ బాండ్లు తాకట్టు పెట్టి రూ. 8 వేల కోట్లు అప్పులు తెచ్చారు. రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ (ఏపీఎస్ డీసీ) ద్వారా దొడ్డిదారిన ఇప్పటికే మద్యంపై వచ్చే 15 ఏళ్ల ఆదాయాన్ని తాకట్టు పెట్టి ‎ బ్యాంకుల నుంచి రూ. 25 వేల కోట్లు అప్పులు తెచ్చిన జగన్ రెడ్డి ఇప్పుడు మరో రూ. 8 వేల కోట్లు అప్పులు తెచ్చారు. మధ్యపాన నిషేదం అనే మాటే ఉండదని, పాక్షికంగా కూడా మద్య నిషేధం చేయమని.. అలా చేస్తే.. లిక్కర్ బాండ్లు మూడు నెలల్లో లిక్విడేట్ అయినట్లుగా భావించి చెల్లింపులు చేయాల్సి ఉంటుందనే నిబంధనకు అంగీకరించి ప్రభుత్వం హామీ పత్రం ఇచ్చి మరీ రూ. 8 వేల కోట్లు అప్పు తీసుకున్నారు'' అని తెలిపారు. 

''ప్రభుత్వ ఆదాయం పెంచుకుని అప్పులు తెచ్చుకునేందుకు మద్యం అమ్మకాల్ని పెంచి మహిళల తాలిబొట్లు తెంచుతారా? జగన్ ధనదాహానికి పచ్చని కుటుంబాలను నాశనం చేస్తున్నారు. మహిళల తాళిబొట్లు తెంచుతూ కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నారు. అమ్మఒడికి రూ. 14 వేలిచ్చి నాన్న బుడ్డితో రూ. 40 వేలు లాక్కుంటున్నారు. మద్యం షాపుల్లో ఎందుకు డిజిటల్ లావాదేవీలు నిర్వహించకుండా జీఎస్టీ, ట్యాక్సులు కట్టకుండా వేల కోట్లు మింగుతున్నారు. తండ్రి తాగితే కొడుకుకు అమ్మ ఒడి, కొడుకు తాగితే తల్లికి వృద్ధాప్య పింఛన్, భర్త తాగితే భార్యకు ఆసరా ఇస్తామని ప్రభుత్వమే చెప్పడం తుగ్లక్ పాలనకు నిదర్శనం కాదా?'' అంటూ అనురాధ మండిపడ్డారు. 

''సీఎం జగన్ రెడ్డి, వైసీపీ నేతలు అక్రమ సంపానద కోసం రాష్ట్రాన్ని మద్యం, నాటుసారా గంజాయికి కేంద్రంగా మార్చారు. ప్రభుత్వ తీరుతోనే రాష్ట్రంలో మహిళలపై గృహ హింస, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. మద్యపాన నిషేదం చేస్తానని, పూర్తి మద్యపాన నిషేదం చేస్తేనే ఓట్లు అడుగుతానని ప్రగల్బాలు పలికిన జగన్ ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెబుతారు? అదుపుతప్పిన పాలనను అదుపులోకి తెచ్చి, సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలి'' అని టీడీపీ మహిళా నేత గద్దె అనూరాధ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.