వన్ టైమ్ సెటిల్ మెంట్ పేరిట ప్రజలను దోచుకోడానికి జగన్ సర్కార్ పథకం వేస్తోందని... ప్రజలెవ్వరూ డబ్బులు కట్టవద్దని టిడిపి నాయకులు నారా లోకేష్ సూచించారు.

అమరావతి: అండగా ఉంటానంటూ హామీ ఇచ్చిన డ్వాక్రా అక్కాచెల్లెళ్ల‌మ్మ‌ల‌కే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి టోక‌రా వేశార‌ని టిడిపి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ఆరోపించారు. ద‌శాబ్దాల‌క్రితం క‌ట్టుకున్న ఇళ్ల‌కు ఇప్పుడు వ‌న్‌టైమ్ సెటిల్మెంట్ అంటూ బ‌ల‌వంతంగా ప‌దివేలు వ‌సూలు చేస్తున్నారని... ఈ పేరుతో డ్వాక్రా మ‌హిళ‌ల‌ ఖాతాలు ఖాళీ చేస్తున్నారని లోకేష్ ఆందోళన వ్యక్తం చేసారు. 

''one time settlement పై ఎలాంటి బలవంతం లేదంటూనే ఇప్పుడు ఎవ‌రైనా క‌ట్ట‌క‌పోతే వారి కుటుంబ‌స‌భ్యుల పింఛ‌న్లు ఆపేస్తామ‌ని బెదిరిస్తున్నారు. చివరకు ఆ ఇంట్లో డ్వాక్రా మ‌హిళ‌లు వుంటే వారి ఖాతాల నుంచి వసూలు చేసుకుంటున్నారు. ఈ అరాచ‌క ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌ని తీవ్రంగా ఖండిస్తున్నాం'' అంటూ nara lokesh ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

''అధికారంలోకి రాక‌ముందు మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారతే లక్ష్యమన్నారు. ఇప్పుడేమో మహిళల్ని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నారు. డ్వాక్రా మహిళలకు అభయంగా నిలిచిన అభయహస్తంపై జ‌గ‌న్ కబంధహస్తాల్లో చిక్కుకుంది. ఇప్పుడు ఈ ప‌థ‌కం అమ‌లుపై నీలినీడలు కమ్ముకున్నాయి. మహిళలు రూపాయి రూపాయి కూడబెట్టి అభయహస్తం పథకం కోసం ఎల్ఐసీలో దాచుకున్న రెండు వేల కోట్లు మళ్లించుకున్న జ‌గ‌న్ స‌ర్కారు, ఎల్ఐసీని ప‌థ‌కం నుంచి గెంటేయ‌డం ప‌థ‌కం ప్ర‌కారం చేసింది. ఈ సొమ్మంతా జ‌గ‌న్ స‌ర్కారు స్వాహా చేసింది'' అని లోకేష్ ఆరోపించారు.

read more ఇది ప్రాజాస్వామ్యమా? అవ్వను అవమానించారు: రాష్ట్ర సర్కారుపై టీడీపీ ఫైర్

''అభ‌య‌హ‌స్తం పథకం ప్రారంభమైన నాటి నుంచి 34 లక్షలకు పైగా పొదుపు మహిళలు క్ర‌మం త‌ప్ప‌కుండా ప్రీమియమ్ చెల్లించారు. ఈ ప‌థ‌కం కింద 60 ఏళ్లు దాటిన‌ 4 లక్షలమందికి పైగా మ‌హిళ‌ల‌కు ఎల్ఐసీ రూ. 500 నుంచి రూ. 2200 వరకూ నెలవారీ పెన్షన్ వ‌స్తోంది. ఈ ఆస‌రాలేకుండా చేసిన జ‌గ‌న్‌రెడ్డి మ‌హిళ‌ల్ని మోస‌గించారు. ఇప్పుడు ఓటిఎస్ పేరుతో మరో దోపిడీకి తెరలేపారు'' అని ఆరోపించారు. 

''1983 నుంచి వివిధ ప్రభుత్వాలు పేదలకు నిర్మించి ఇచ్చిన ఇళ్లకు వన్ టైం సెటిల్మెంట్ పేరుతో రూ. 1500 కోట్లు దోపిడీకి ప్లాన్ చేశారు. ఓటీఎస్ కోసం రూ. 10 వేలు చెల్లించకపోతే పెన్షన్ ఆపుతామని, రేష‌న్‌కార్డు తీసేస్తామ‌ని, ప‌థ‌కాల‌కు అన‌ర్హుల‌ను చేస్తామ‌ని నియంతలను తలపించే విధంగా బెదిరించ‌డం మానుకోవాలి. ఓటీఎస్ స్వ‌చ్ఛంద‌మైన‌ప్పుడు ఈ బెదిరింపులు ఎందుకు?'' అని లోకేష్ ప్ర‌శ్నించారు. 

''ఒక్క‌రు కూడా ఓటీఎస్ క‌ట్టేందుకు ముందుకు రాక‌పోవ‌డంతో జ‌గ‌న్ స‌ర్కారు కాల్ మనీ మాఫియా అవ‌తార‌మెత్తింది. ఓటిఎస్ డబ్బు చెల్లించకపోతే... ల‌బ్ధిదారుల కుటుంబ‌స‌భ్యుల‌ డ్వాక్రా పొదుపు సొమ్ము జమ చేసుకుంటామ‌న‌డం ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనం. పొదుపు సంఘాల లీడర్లను వెంటపెట్టుకుని స్వయంగా అధికారులు బ్యాంకులకు వెళ్లడం పొదుపు సొమ్ము ఖాళీ చేసి ఓటిఎస్ కి చెల్లించడం మహిళల్ని వంచించ‌డ‌మే'' అని మండిపడ్డారు. 

''ప్రభుత్వం పాల్పడుతున్న అనాలోచిత నిర్ణయాల వలన డ్వాక్రా సంఘాల ఉనికి ప్రశ్నార్ధకంగా మారనుంది. అప్పులు దొర‌క్క ప్ర‌భుత్వం పొదుపు ఖాతాలు ఖాళీ చెయ్యడం వలన డ్వాక్రా గ్రూపుల భవిష్యత్తు అంధ‌కారం కానుంది. మ‌హిళాసాధిక‌ర‌త‌కి, స్వావ‌లంబ‌న‌కి దిక్సూచిలాంటి డ్వాక్రా సంఘాలని నిర్వీర్యం చేసే ఇటువంటి దందా వ్య‌వ‌హారాల‌ను ప్ర‌భుత్వం ఆపాలి. అర‌వైఏళ్లు దాటిన మ‌హిళ‌ల‌కు వ‌రంలాంటి అభయహస్తం పథకాన్ని పునరుద్ధరించాలి'' అని లోకేష్ డిమాండ్ చేసారు.

''ఓటీఎస్ ఎవ్వ‌రూ రూపాయి క‌ట్టొద్ద‌ు... ఓటీఎస్‌ కింద పొదుపుఖాతాల నుంచి జ‌మ వేసుకునే చ‌ర్య‌ల‌ను మ‌హిళ‌లంతా సంఘ‌టిత‌మై అడ్డుకోవాలి. టిడిపి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఇళ్ల‌ను ఉచితంగా రిజిస్ట్రేష‌న్ చేస్తాం'' అని నారా లోకేష్ హామీ ఇచ్చారు.