ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనపై నారా లోకేేష్ సంచలన వ్యాఖ్యలు చేసారు. సింగడు అద్దంకి అంగడి పోయిన సామెతలా జగ్గడి పర్యటన కూడా వుందంటూ వ్యాఖ్యానించారు.

అమరావతి: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌ నగరంలో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాల్లో పాల్గొన్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి రాష్ట్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైఎస్ జగన్ విదేశీ పర్యటనపై సంచలన వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రానికి పెట్టుబడుల కోసం వెళ్లిన సీఎం ఏం తెచ్చాడో ఎవ్వరికీ తెలియడంలేదన్నారు. సీఎం అసలు విదేశాలకు ఎందుకెళ్లాడో కూడా అర్థమవడం లేదంటూ లోకేష్ మండిపడ్డారు.

''సింగడు అద్దంకి పోయి వచ్చిన సామెతలా ఉంది జగ్గడి దావోస్ పర్యటన. సింగడు అద్దంకి ఎందుకో పోయాడో ఎందుకు వచ్చాడో తెలీదు అనే మన తెలుగు సామెతను జగ్గడు మళ్లీ గుర్తుకు తెచ్చారు. జగ్గడు అసలు దావోస్ ఎందుకు పోయారో... ఏమి తెచ్చారో ఎవరికీ తెలీదు. అసలే అంతంత మాత్రం గా ఉన్న ఆర్థిక పరిస్థితికి స్పెషల్ ఫ్లైట్ విలాసాల ఛార్జీల మోత అదనపు భారం తప్ప...రాష్ట్రానికి పైసా లాభం లేదు'' అంటూ లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేసారు.

ఇక జగన్ పాలన మూడేళ్లు పూర్తిచేసుకోవడంపై కూడా నారా లోకేష్ స్పందించారు. ''జగన్ రెడ్డి గారి మూడేళ్ల పాలన మూడు మాటల్లో.. విద్వేషం..విధ్వంసం..విషాదం. మూడేళ్లలో సాధించింది శూన్యం... మిగిలిన ఈ రెండేళ్లలో రాష్ట్రం సర్వనాశనం ఖాయం'' అంటూ లోకేష్ హెచ్చరించారు.

ఇక ఇంతకుముందు కూడా సీఎం జగన్ దావోస్ పర్యటనపై లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేసారు. సీఎం దావోస్ పర్యటన వైసీపీ పొలిట్ బ్యూరో సమావేశంలా ఉందని లోకేష్ ఎద్దేవా చేశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు దావోస్‌లో పారిశ్రామికవేత్తలు ఎవరూ ముందుకు రావడం లేదని విమర్శించారు. ఒకవేళ పారిశ్రామివేత్తలు ఎవరైనా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదని అడిగితే ఏం సమాధానం చెబుతారని సీఎం జగన్ ని ప్రశ్నించారు. అదానీని కలిసేందుకు దావోస్ దాకా వెళ్లడం ఎందుకు... ఢిల్లీ వెళ్లినా ఆయన కలుస్తారని ఎద్దేవా చేశారు. 

సీఎం జగన్ కుటుంబంతో కలిసి ప్రత్యేక విమానం దావోస్ వెళ్లేందుకు రూ. 8 కోట్లు ఖర్చు చేశారని లోకేష్ ఆరోపించారు. నేరుగా దావోస్‌కు వెళ్లకుండా లండన్ ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. సీఎం జగన్ దేశం వదిలి వెళ్లాక పెట్రోల్ ధరలు తగ్గాయన్నారు. మూడేళ్ల సినిమా అయిపోయిందని.. జగన్ ఇక ఇంటికే అని అన్నారు. ప్రజలను ధరలు, పన్నుల పేరుతో పీడించి నరకం చూపించారని లొకేష్ ఆరోపించారు.

ఇదిలావుంటే తెలంగాణ ఐటీమంత్రి కేటీఆర్ కూడా వరల్డ్ ఎకానమిక్ ఫోరంలో పాల్గొనేందుకు దావోస్ వెళ్లారు. ఈ క్రమంలో సీఎం జగన్, కేటీఆర్ సమావేశమయ్యారు. 'నా సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ గారితో గొప్ప సమావేశం జరిగింది' అంటూ మంత్రి కేటీఆర్ జగన్ తో కలిసున్న ఫోటోను జతచేస్తూ ట్వీట్ చేసారు.

వీళ్లిద్దరూ ఎంతసేపు భేటీ అయ్యారు... ఏయే అంశాలమీద చర్చించారనేది తెలియలేదు. అయితే తెలంగాణలో టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, ఏపీలో ప్రతిపక్ష నేత చంద్రబాబును ఇరకాటంలో పెట్టేలా ఓటుకు నోటు కేసును మళ్ళీ తెరపైకి తీసుకురావడానికే వీరిద్దరూ కలిసి చర్చించినట్లుగా ప్రచారం జరుగుతోంది.