ఆంధ్ర ప్రదేశ్ దివాళా తీసిందనడానికి ఇదొక్కటి చాలదా..!: జగన్ సర్కార్ పై లోకేష్ ఫైర్
చివరకు స్కూలు పిల్లలకు ఇంటర్నల్ ఎగ్జామ్స్ నిర్వహించడానికి పేపర్లు కూడా ఇవ్వలేనంత దారుణంగా ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక పరిస్థితి వుందని లోకేష్ అన్నారు.
విజయవాడ : ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తామని ఆంధ్ర ప్రదేశ్ లోని స్పెషాలిటి హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి లేఖ రాయడంపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు.ఈ లేఖ రాష్ట్రంలో నెలకొన్న దుస్థితికి అద్దం పడుతోందన్నారు. ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ హాస్పిటల్స్ కు గత ఆరు నెలలుగా ప్రభుత్వం డబ్బులు చెల్లించడంలేదు... దీంతో ఇప్పటివరకు దాదాపు రూ.1000 కోట్లు బకాయిపడ్డట్లు లోకేష్ తెలిపారు. ఈ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27 నుండి ఆరోగ్యశ్రీ వైద్యసేవలు నిలిపివేయనున్నట్లు హాస్పిటల్ అసోసియేషన్ హెచ్చరిస్తోంది... ఇదీ జగన్ సర్కార్ పాలనలో పేదల పరిస్థితి అంటూ లోకేష్ ఆందోళన వ్యక్తం చేసారు.
పేదల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని... హాస్పిటల్స్ కు వెంటనే బకాయి డబ్బులు విడుదల చేసి వైద్యసేవల కొనసాగేలా చూడాలని లోకేష్ ప్రభుత్వాన్ని కోరారు. హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తే వైద్యం అందక పేదలు ఇబ్బందిపడతారని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా తీసిందని అర్థమవుతోంది... కానీ పేదల కోసం ఎలాగైనా హాస్పిటల్స్ బకాయిలు చెల్లించాలని లోకేష్ డిమాండ్ చేసారు.
కరోనా విజృంభిస్తున్న విపత్కర పరిస్థితుల్లోనూ వైద్యం అందించలేక ఈ ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని లోకేష్ గుర్తుచేసారు. సాక్షాత్తు సిఎం సొంత జిల్లా కడపలో ఆరోగ్యశ్రీ కింద వైద్యసేవలు అందించబడవని బోర్డులు పెట్టడం అందరం చూసాం... జగన్ రెడ్డి పనితనమేమిటో రాష్ట్రప్రజలకు అప్పుడే అర్థమయ్యిందంటూ ఎద్దేవా చేసారు. పాలించడం చేతగాక రాష్ట్ర ఖజానాను దివాలా తీయించిన ముఖ్యమంత్రి ముఖం చూసి కాంట్రాక్టర్లు కూడా పరారవుతున్నారని లోకేష్ అన్నారు.
Read More కోటప్పకొండ ఘాట్ రోడ్డుపై ప్రమాదం... భక్తుల హాహాకారాలతో ఘటనాస్థలిలో భయానక పరిస్థితి (వీడియో)
చివరకు స్కూలు పిల్లలకు ఇంటర్నల్ ఎగ్జామ్స్ నిర్వహించడానికి పేపర్లు కూడా ఇవ్వలేని దారుణ పరిస్థితి ఏపీలో వుందన్నారు లోకేష్. దిక్కులేని పరిస్థితిలో
వాట్సాప్ లో ప్రశ్నపత్రాలను పంపించిన విచిత్రమైన పరిస్థితిని కూడా చూసామన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా వుందో తెలియజేసేందుకు ఇదొక్కటి చాలని లోకేష్ అన్నారు.
నాలుగున్నరేళ్లుగా అస్తవ్యస్తమైన ఆర్థిక విధానాలతో రాష్ట్ర పరపతిని దిగజార్చారని లోకేష్ అన్నారు. ట్రిపుల్ ఎ ప్లస్ గా ఉన్న రాష్ట్ర పరపతిని ఇప్పుడు ట్రిపుల్ బి ప్లస్ కు దిగజారిందన్నారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకానికి నిధులు కేటాయించకుండా లక్షలాది నిరుపేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు. నెట్ వర్క్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేసి పేదలకు ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని నారా లోకేష్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసారు.