కోటప్పకొండ ఘాట్ రోడ్డుపై ప్రమాదం... భక్తుల హాహాకారాలతో ఘటనాస్థలిలో భయానక పరిస్థితి (వీడియో)
కోటప్పకొండపై వెలిసిన త్రికోటేశ్వర స్వామి దర్శనానికి వెళుతుండగా భక్తులు రోడ్డుప్రమాదానికి గురయ్యారు.
నరసరావుపేట : ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రముఖ దేవాలయమైన కోట్టప్పకొండకు ఓ కుటుంబం పిల్లాపాపలతో వెళుతుండగా ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. నంద్యాల జిల్లా గాజుపల్లి గ్రామానికి చెందినవారు బొలేరో వాహనంలో కోటప్పకొండకు చేరుకుని గుడివద్దకు వెళుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కొండపైకి వెళ్లే క్రమంలో ఘాట్ రోడ్డుపై అదుపుతప్పిన వాహనం బోల్తాపడింది. దీంతో భక్తులు గాయాలపాలయ్యారు.
నంద్యాల సమీపంలోని గాజులపల్లికి చెందిన ఓ కుటుంబం ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రముఖ దేవాలయాలను చుట్టివచ్చేందుకు తీర్థయాత్ర చేపడుతోంది. ఇలా విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మను ఈ కుటుంబం దర్శించుకుంది. అక్కడినుండి పల్నాడు జిల్లా నరసరావుపేట మండలంలోని మరో ఆద్యాత్మిక కేంద్రం కోటప్పకొండకు చేరుకున్నారు.
Read More Medak Accident : హైవేపై ఘోర ప్రమాదం ... ధాన్యం ట్రాక్టర్ ను ఢీకొన్న బొలేరో, ఆర్టిసి బస్సు
త్రికోటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు కోటప్పకొండపైకి వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఘాటురోడ్డుపై అదుపుతప్పిన బొలేరో వాహనం బోల్తా పడింది. దీంతో అందులోని పదమూడు మందితో పాటు వంటసామాగ్రి, బ్యాగులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. భక్తుల్లో ఆరుగురు తీవ్రంగా గాయపడగా వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది.
వీడియో
ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను దగ్గర్లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సమయానికి వారికి వైద్యం అందడంతో ప్రమాదం తప్పింది. ఇప్పటికయితే క్షతగాత్రుల్లో ఎవరికీ ప్రాణహాని లేదని డాక్టర్లు చెబుతున్నారు.
ఈ యాక్సిండెంట్ పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. హాస్పిటల్లో చికిత్స పొందతున్న క్షతగాత్రులతో పాటు మిగతా బాధితుల నుండి ప్రమాదానికి సంబంధించి వివరాలు తెలుసుకున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.