టిడిపి అధినేతలతో భువనేశ్వరి మాత్రమే...! లోకేష్ దీక్షలో ఆసక్తికరమైన బ్యానర్ (వీడియో)
మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు నిరసనగా దేశ రాజధాని న్యూడిల్లీలో నారా లోకేష్ సత్యమేవ జయతే పేరిట నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వేదికపై ఏర్పాటుచేసిన బ్యానర్ ఆసక్తికరంగా మారింది.

న్యూడిల్లీ : తండ్రి ముఖ్యమంత్రిగా పనిచేసారు... భర్త కూడా ముఖ్యమంత్రిగా పనిచేసారు... సొంత కొడుకు, సోదరి, సోదరుడు రాజకీయాల్లో వున్నారు... ఇలా చుట్టూ రాజకీయ వాతావరణమే వున్నా నారా భువనేశ్వరి ఏనాడూ పాలిటిక్స్ వైపు కన్నెత్తి చూడలేదు. కానీ రిటైర్మెంట్ వయసులో ఆమె రాజకీయాలు చేయక తప్పడంలేదు. తన భర్తను జైల్లో పెట్టడం... కొడుకుపై కూడా కేసులు పెట్టిన సిఐడి అరెస్ట్ చేస్తుందన్న ప్రచారం నేపథ్యంలో భువనేశ్వరి రంగంలోకి దిగాల్సి వచ్చింది. ప్రస్తుతం పార్టీ అధ్యక్షురాలు భువనేశ్వరే అనేస్థాయిలో టిడిపి శ్రేణులు ఆమె ఫోటోలతో ప్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటుచేస్తున్నారు.
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ కు నిరసనగా దేశ రాజధాని న్యూడిల్లీలో నారా లోకేష్ సత్యమేవ జయతే పేరిట నిరాహార దీక్ష చేపట్టారు. గాంధీ జయంతి సందర్భంగా చేపట్టిన ఈ దీక్ష కోసం ఏర్పాటుచేసిన బ్యానర్ అందరినీ ఆకట్టుకుంటోంది. టిడిపి ఏర్పాటుచేసిన బ్యానర్ లో ఎన్టీఆర్, చంద్రబాబులతో పాటు భువనేశ్వరి ఫోటోకు మాత్రమే చోటుదక్కింది. ఈ బ్యానర్ ను సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న నాయకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.
లోకేష్ నిరాహార దీక్ష వేదికపై మరో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. వైసిపి రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా లోకేష్ కు సంఘీభావం తెలిపారు. ఇప్పటికే వైసిపికి దూరంగా వుంటూ టిడిపికి అనుకూలంగా వ్యవహరిస్తున్న రఘురామ తాజాగా టిడిపి ఎంపీలతో కలిసి లోకేష్ దీక్షలో పాల్గొన్నారు.
వీడియో
ఇక స్వాతంత్ర్య సమరయోధుడు, దివంగత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తున్నానంటూ లోకేష్ ట్వీట్ చేసారు. నిష్కళంక, నిస్వార్థ ప్రజాసేవకులు లాల్ బహదూర్ శాస్త్రి... ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి పాటుపడదామని లోకేష్ అన్నారు.
ఇదిలావుంటే తన భర్త చంద్రబాబు జైల్లో వున్న రాజమండ్రిలోనే నారా భువనేశ్వరి సత్యమేవ జయతే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన భువనేశ్వరి నిరాహార దీక్షకు కూర్చున్నారు. టిడిపి మహిళా నాయకులు, కార్యకర్తలు కూడా భువనేశ్వరితో కలిసే నిరాహార దీక్షకు కూర్చుకున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు కూడా ఇవాళ నిరాహార దీక్ష చేపట్టారు.
Read More సత్యమేవ జయతే పేరుతో టీడీపీ దీక్షలు.. జైలులో చంద్రబాబు, ఢిల్లీలో లోకేష్, రాజమండ్రిలో భువనేశ్వరి..
మంగళగిరిలో ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సత్యమేవ జయతే దీక్ష చేపట్టారు.మహాత్మాగాంధీ చిత్రపటానికి, ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి ఆయన దీక్షను ప్రారంభించారు. శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరిఫ్, కొమ్మారెడ్డి పట్టాభిరాం లతో పాటు లాయర్లు, టీచర్లు కూడా ఈ దీక్షలో పాల్గొన్నారు.