అమరావతి:  ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్వి నారా లోకేష్  వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు. చంద్రబాబును అవినీతి పరుడిగా ముద్ర వేయాలనే ప్రయత్నం విఫలయత్నంగానే మిగిలిపోతోందని లోకేష్  అభిప్రాయపడ్డారు. అక్రమాస్తుల కేసులో ఏ 1 ముద్దాయి అవినీతిపై విచారణకు కమిటీ వేయడమా... ఏ 2 ముద్దాయి విచారణ నిర్వహిస్తారా అని ఆయన మండిపడ్డారు.

 

చంద్రబాబు పాలనకు వైఎస్ఆర్ పాలనకు మధ్య పోలికను చూపెడుతూ లోకేష్ ట్విట్టర్‌లో ట్వీట్లు చేశారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో   సోలార్ విద్యుత్‌ను యూనిట్‌ కు రూ. 14 రూపాయాలకు కొనుగోలు చేశారని.... టీడీపీ హాయంలో కేవలం రూ. 2.70లకు కొనుగోలు చేసినట్టుగా లోకేష్ గుర్తు చేశారు. వైఎ స్ఆర్ హాయంలో తీసుకొన్న ఈ నిర్ణయం కారణంగా డిస్కం‌లకు రూ. 8 వేల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు.

 

తమ పార్టీ ఏపీ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టేనాటికి  22 మిలియన్  యూనిట్ల లోటు విద్యుత్ ను పూడ్చివేసినట్టుగా లోకేష్ చెప్పారు. అంతేకాదు  లోటు విద్యుత్ నుండి రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రంగా తీర్చిదిద్దినట్టుగా  ఆయన చెప్పారు. 

 

ఎలాంటి ఆధారాలు లేకుండానే రూ.2636 కోట్ల అవినీతి జరిగిందని ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు.  బట్ట కాల్చి మీద వేశారని ఆయన విమర్శించారు.  తమ ప్రభుత్వ హాయంలో విద్యుత్ శాఖను ఆదర్శంగా నిలిపినట్టుగా లోకేష్ చెప్పారు. రూ. 36 వేల కోట్ల పెట్టుబడి పెట్టి.. 13 వేల మందికి ఉపాధి కల్పించామన్నారు. విద్యుత్ రంగంలో తమ సర్కార్ తెచ్చిన ఫలితాలకు గాను  150కు పైగా అవార్డులు వచ్చాయన్నారు.