అమ్మఒడి పథకం కింద లబ్ది పొందుతున్న అర్హులను తగ్గించేందుకు వైసిపి సర్కార్ ఆంక్షల పేరిట కుట్రలు పన్నుతోందని మాజీ మంత్రి  నారా లోకేష్ ఆరోపించారు. 

మంగళగిరి: అమ్మఒడి పథకం లబ్దిదారులను ఎంత సాధ్యమైతే అంత తగ్గించడానికే జగన్ సర్కార్ ఇష్టంవచ్చినట్లు ఆంక్షలు విధిస్తోందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (nara lokesh) ఆరోపించారు. ఇంటి కరెంట్ బిల్లు, విద్యార్థుల హాజరు,రేషన్ కార్డు, ఇప్పుడు కొత్త జిల్లాల పేరిట లబ్దిదారులను గందరగోళానికి గురిచేస్తున్నారని... తద్వారా అమ్మఒడి అర్హులను తగ్గించే కుట్ర వైసిపి ప్రభుత్వం చేస్తోందన్నారు. కన్నతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానన్నట్టు ఉంది జగన్ మోసపు రెడ్డి అమ్మ ఒడి పథకం తీరు అని లోకేష్ ఎద్దేవా చేసారు. 

''తేదీల మతలబుతో ఒక ఏడాది ఎగ్గొట్టి... మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో రూ.1000 కోత పెట్టి అమ్మఒడి కాస్త అర్దఒడిగా మారింది. ఇప్పుడు ఈ పథకంపై మరిన్ని ఆంక్షల కత్తి ఎక్కుపెట్టి దీని మనుగడనే ప్రశ్నార్ధకంగా మార్చేసారు. 300 యూనిట్లు దాటి కరెంట్ వాడితే కట్, ప్రతి విద్యార్థికి 75 శాతం హాజరు తప్పనిసరి, ఆధార్‍లో కొత్త జిల్లాలను నమోదు చేసుకోవాలి, కొత్త బియ్యం కార్డు ఉంటేనే అమ్మఒడి లాంటి కండిషన్స్ అప్ప్లై అని ముందే ఎందుకు చెప్పలేదు జగన్ మోసపు రెడ్డి గారు?'' అని లోకేష్ ప్రశ్నించారు. 

''చివరకు మీ సతీమణి వైఎస్ భారతి ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే రూ.30 వేలు వేస్తామని ఇచ్చిన హామీని కూడా గంగలో కలిపేసారు. ఇది చాలా దారుణం. కాబట్టి అమ్మలని మానసిక క్షోభకి గురిచేసే ఈ ఆంక్షలు తీసేసి అర్హులందరికీ అమ్మ ఒడి ఇవ్వాలి'' అని లోకేష్ వైసిపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.

విద్యార్థుల హాజరు 75 శాతం వుంటేనే ఇకపై అమ్మ ఒడి అందించాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. గతేడాదే ఈ నిర్ణయం తీసుకున్నా కరోనా కారణంగా అమలుచేయలేకపోయారు. అయితే ఈసారి ఖచ్చితంగా హాజరును పరిగణలోకి తీసుకునే అమ్మఒడి అర్హులను నిర్ణయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఆదేశాలు కూడా అందాయి. నవంబర్ 8 నుండి ఏప్రిల్ 30వరకు విద్యార్థి హాజరు 75శాతం ఉండాలని... అయితేనే అమ్మఒడికి అర్హులుగా గుర్తించనున్నట్లు జగన్ సర్కార్ ప్రకటించింది. 

ఈ నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగం, తెల్లరేషన్ కార్డు, ఇటీవల కొత్తజిల్లాల నమోదు, వ్యవసాయ భూములను సాకుగా చూపి అమ్మఒడి లబ్దిదారులను భారీగా తగ్గించారని... ఇప్పుడు హాజరు పేరిట మరికొంతమందిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. 

ఇంట్లో విద్యుత్ వాడకాన్ని కూడా అమ్మఒడికి లింక్ చేసింది వైసిపి ప్రభుత్వం. లబ్ధిదారుల ఇంటి విద్యుత్ వినియోగం 300 యూనిట్లు దాటితే ఆ కుటుంబానికి అమ్మఒడి ప్రయోజనాలు అందించబోమని జగన్ సర్కార్ తేల్చింది. ఇక కొత్త బియ్యం కార్డు వున్నవారికే అమ్మఒడి అందుతుందని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. 

ఇక ఆధార్ కార్డ్ అప్ డేట్ చేయకున్న అమ్మఒడికి అర్హత కోల్పోనున్నారు. కొత్త జిల్లాల పేరిట ఆధార్ కార్డ్ వుండాలని... అందుకోసం పాతకార్డును అప్ డేట్ చేసుకోవాలని సూచించింది. కొత్త జిల్లాల అడ్రస్ తో వుండే ఆధార్ కార్డు కలిగిన వారికే అమ్మఒడి అందించనున్నారు. అమ్మఒడి డబ్బులు పడే బ్యాంక్ అకౌంట్ కూడా ఆధార్ కార్డ్ తో లింక్ అయి వుండాలి. లేకుంటే వెంటనే బ్యాంక్ కు వెళ్లి లింక్ చేయించుకోవాలని... ఇలాంటి బ్యాంక్ అకౌంట్ మాత్రమే తమకు ఇవ్వాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు.