అమరావతి: ఒంగోలులో దివ్యాంగురాలి సజీవదహనం ఘటనపై టిడిపి జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. ఇలా రాష్ట్రంలో అత్యంత దారుణ ఘటన జరిగినా ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు వేడుకల్లో మునిగితేలుతున్నాడంటూ సోషల్ మీడియా వేదికన నారా లోకేష్ మండిపడ్డారు.

''ఒంగోలులో దివ్యాంగురాలు భువనేశ్వరిని అత్యంత దారుణంగా సజీవ దహనం చేస్తే స్పందించే హృదయం, సమయం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారికి లేదు. ఈ ఘటన ద్వారా మహిళల రక్షణ పట్ల ఆయనకు చిత్తశుద్ధి లేదు అనే విషయం మరోసారి బయటపడింది'' అంటూ లోకేష్ మండిపడ్డారు.

''జన్మదినోత్సవం అంటూ భజన కార్యక్రమాలకు ఇస్తున్న సమయం కూడా మహిళల రక్షణ చర్యలకు ఇవ్వకపోవడం బాధాకరం. రాష్ట్రంలో ప్రతీ రోజు మహిళలపై జరుగుతన్న అఘాయిత్యాలు, హత్యాచారాలు ఆందోళన కలిగిస్తున్నాయి'' అని ఆవేదన వ్యక్తం చేశారు.

''18 నెలల పాలనలో 310 ఘటనలు జరిగినా ప్రభుత్వంలో చలనం లేదు. ఒక్క మృగాడికి శిక్ష పడలేదు. దిశ చట్టం పేరుతో పబ్లిసిటీ పిచ్చి తప్ప ఒక్క మహిళకూ న్యాయం జరగలేదు'' అని పేర్కొన్నారు.

''ఈ దుర్ఘటనపై పూర్తిస్థాయిలో అత్యున్నత దర్యాప్తు జరపాలి, నిజానిజాలను బైటపెట్టి,దీనికి కారకులను కఠినంగా శిక్షించాలి. భువనేశ్వరి కుటుంబాన్ని ఆదుకొని ప్రభుత్వం న్యాయం చెయ్యాలి'' అని లోకేష్ డిమాండ్ చేశారు.

''పొలిసు వాహనాలకు వైకాపా రంగులా!పైగా పాత వాహనాలకు కొత్తగా రంగులు వేసి దిశ పేరుతో ఘరానా మోసం. కొంత మంది పోలీస్ అధికారుల అత్యుత్సాహం చూస్తుంటే త్వరలో యూనిఫామ్ కూడా వైకాపా రంగులోకి మార్చేసేలా ఉన్నారు'' అంటూ పోలీసుల తీరుపై సెటైర్లు విసిరారు.

''రంగులతో మహిళలకు రక్షణ రాదు, మూడు రంగుల మదంతో రోడ్ల మీద పడి మహిళల్ని వేధిస్తున్న మృగాళ్లను శిక్షిస్తే మహిళలు ధైర్యంగా బయటకి రాగలుగుతారు. ఫ్యాక్ట్ చెక్ పేరుతో అవి వైకాపా రంగులు కాదు శాంతికి చిహ్నాలు అంటూ సమయం వృధా చెయ్యకుండా మహిళలకు భద్రత కల్పించడంపై పోలీసులు దృష్టి పెడితే మంచిది'' అని లోకేష్ సూచించారు.