గుంటూరు: రాష్ట్రంలో కరోనాను నియంత్రించడం చేతగాక చేతులెత్తేసిన వైసిపి ప్రభుత్వం ఇప్పడు రోగులకు చికిత్స అందించడంలోనూ పూర్తిగా విఫలమవుతోందని మాజీ మంత్రి, టిడిపి జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేష్ ఆరోపించారు. కరోనా రోగులకు చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని... లక్షల బెడ్లు సిద్దం చేశామని ఓ వైపు ముఖ్యమంత్రి జగన్ చెబుతుంటే మరోవైపు బెడ్లు ఖాళీగా లేవంటూ హాస్పిటల్ సిబ్బంది రోగులకు చికిత్సను నిరాకరిస్తున్నారని అన్నారు. ఓ కరోనా రోగి తన ఆందోళన, ఆవేదనను వ్యక్తపరుస్తూ సాయం చేయాలంటూ వేడుకున్న వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు లోకేష్.  

''అవసరానికి మించి బెడ్లు ఏర్పాటు చేసాం అని వైఎస్ జగన్ గారు అంటున్నారు. బెడ్లు లేవని మమ్మల్ని రోడ్ల మీదే వదిలేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కోవిడ్ బాధితులు'' అంటూ లోకేష్ మండిపడ్డారు. 

''అనంతపురం జిల్లా,మడుగుపల్లి గ్రామానికి చెందిన మన్మధ రెడ్డి తండ్రి కరోనాతో మరణించారు. కుటుంబసభ్యులకు వైద్యం అందని పరిస్థితి. ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదు. ఇప్పటికైనా జగన్ రెడ్డి కళ్ళు తెరవాలని కోరుకుంటున్నాను''  అంటూ  లోకేష్ ట్వీట్ చేశారు. 

అంతేకాకుండా రెండు రోజుల క్రితం కరోనా సోకిన ఓ కుటుంబంమొత్తం వైద్యం కోసం ఎదురుచూస్తున్న విషయాన్ని లోకేష్ ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చాడు. సదరు బాధిత కుటుంబం ఆవేదనతో తమను కాపాడాలంటూ వేడుకుంటున్న వీడియోను జతచేస్తూ లోకేష్ ట్వీట్ చేశారు.  

''టెస్టింగ్ నుండి ట్రీట్మెంట్ వరకూ అన్నీ అబద్దాలే. కరోనా పెద్ద విషయం కాదన్న రోజునుండి అదే నిర్లక్ష్య ధోరణి. అనంతపురం, అశోక్ నగర్ కి చెందిన భవాని శంకర్ కుటుంబంలో 5గురికి కరోనా పాజిటివ్ అని చెప్పి ఇంటికి పంపారు''

''వస్తుందన్న అంబులెన్స్ అడ్రెస్ లేదు, పట్టించుకున్న నాధుడు లేడు. రెండు రోజులుగా కుటుంబం పడుతున్న ఆవేదన వర్ణణాతీతం. ప్రజలకి ఆసుపత్రుల్లో బెడ్స్ లేవంటూ గాలికొదిలేస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు,నాయకులకు హైదరాబాద్ లో అధునాతన వైద్యం అందిస్తోంది'' అంటూ బాధిత కుటుంబ బాధను తెలియజేస్తూనే ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ట్వీట్ చేశారు నారా లోకేష్.