ఆంధ్ర ప్రదేశ్ రాజధాని నిర్ణయం తీసుకునే అధికారం కేవలం పార్లమెంట్ కు మాత్రమే వుందని... అందుకు లోబడే ఇటీవల మూడు రాజధానుల నిర్ణయాన్ని కాదని అమరావతికే అనుకూలంగా తీర్చు ఇచ్చిందని నారా లోకేష్ తెలిపారు.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అంశం మరోసారి అసెంబ్లీ (ap assembly) ముందుకు వచ్చింది. అమరావతి (amaravati)నే రాజధానిగా కొనసాగించాలంటూ వైసిపి (ysrcp) ప్రభుత్వ మూడు రాజధానుల (three capitals) నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు, మహిళ ఉద్యమిస్తుండగా ప్రతిపక్షాలన్ని వారికి మద్దతిస్తున్నాయి. అలాగే ఇటీవల హైకోర్టు (ap high court) తీర్పులు కూడా అమరావతికే మద్దతుగా వచ్చాయి. ఈ నేపథ్యంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (nara lokesh) కోర్టు తీర్పును ప్రస్తావిస్తూ ఏపీ రాజధాని (ap capital issue)పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
''ఏపీ రాజధాని అంశానికి సంబంధించి రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుని పట్టుకొని శాసనసభకి ఏ అధికారాలు లేవా? అంటూ ప్రజల్ని జగన్ రెడ్డి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాష్ట్ర విభజన పార్లమెంట్ లో జరిగిందని... ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం పార్లమెంట్ లో పాస్ అయ్యిందని జగన్ గుర్తుంచుకుంటే మంచిది. అందులో స్పష్టంగా ఒక రాజధాని అని అన్నారు... ఎక్కడా రాజధానులు అని లేదు. దాని ఆధారంగానే కోర్టు తీర్పు ఇచ్చింది'' అని లోకేష్ పేర్కొన్నారు.
''రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పులను గౌరవించకుండా న్యాయ వ్యవస్థను కించపర్చేలా వైసిపి నాయకులు వ్యవహరిస్తున్నారు. పవిత్రమైన అసెంబ్లీ వేదికగా బాద్యతాయుత సీఎం పదవిలో వున్న వ్యక్తి మాట్లాడటం బాధాకరం. పదో తరగతి ఫెయిల్ అయిన వైసిపి నాయకులకు, అసలు ఏమి చదివాడో తెలియని జగన్ రెడ్డికి చట్టాల గురించి ఏం తెలుస్తుంది'' అని లోకేష్ ఎద్దేవా చేసారు.
''టిడిపిది సింగిల్ పాయింట్ ఎజెండా... రాష్ట్రానికి ఒకే రాజధాని మరియు అభివృద్ధి వికేంద్రీకరణ. అభివృద్ధి వికేంద్రీకరణ మేము చేసి చూపించాం. చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో ఎంత అభివృద్ధి జరిగింది, ఎన్ని పరిశ్రమలు వచ్చాయో... మీ హయాంలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయో చర్చకు సిద్దమా..? అని లోకేష్ సవాల్ విసిరారు.
''చంద్రన్న పెళ్లి కానుక, అన్నా క్యాంటీన్, చంద్రన్న బీమా, విదేశీ విద్య... ఇలాంటివి చంద్రబాబు బ్రాండ్ లు. అమరావతితో సహా చంద్రబాబు తెచ్చిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు జగన్ రెడ్డి రద్దు చేసారు. నిజంగానే ఆయన అసెంబ్లీలో మాట్లాడినట్లు విచిత్రమైన పేర్లతో వున్న మద్యం బ్రాండ్లకు అనుమతిచ్చింది తామే అయితే వాటిని రద్దు చెయ్యకుండా ఉండేవారా? చెత్త బ్రాండ్లు తెచ్చింది జగన్ రెడ్డే. ఇప్పుడు విమర్శలపాలవుతున్నాడు కాబట్టి చంద్రబాబుపై నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు'' అని అన్నారు.
''వైసీపీ హాయాంలో 141 కొత్త మద్యం బ్రాండ్ లు వచ్చాయని ప్రభుత్వమే ఆర్టీఐ ద్వారా సమాచారం ఇచ్చింది. సభలో చర్చకు అనుమతి ఇస్తే జే బ్రాండ్స్ బాగోతం బయటపడుతుంది. కానీ మండలి ఛైర్మెన్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ మాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం లేదు. లేదంటే ఇప్పటికే జే బ్రాండ్ మద్యం గుట్టు రట్టయ్యేది'' అని లోకేష్ పేర్కొన్నారు.
ఇదిలావుంటే ఇవాళ ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానులపై స్వల్పకాలిక చర్చ జరుగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అసెంబ్లీ స్పీకర్ ను రాజధానిపై చర్య చేపట్టాలని కోరడంతో స్వల్పకాలిక చర్చకు అనుమతించారు.
