నా తండ్రిని చూడటానికి వెళ్లొద్దా.. అడ్డుకునే హక్కు ఎవరిచ్చారు?: పోలీసులపై లోకేష్ ఆగ్రహం (వీడియో)
నారా లోకేష్ పాదయాత్ర ప్రస్తుతం కోనసీమ జిల్లా రాజోలు మండలంలో పొదలాడలో కొనసాగుతుంది. అయితే చంద్రబాబు అరెస్ట్ వార్త తెలుసుకున్న లోకేష్ పొదలాడ యువగళం క్యాంప్ సైట్ నుంచి విజయవాడ బయలుదేరేందుకు సిద్దమయ్యారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును నంద్యాల పోలీసులు శనివారం తెల్లవారుజామున అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనను నంద్యాల నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ స్కామ్‌లో చంద్రబాబును అరెస్ట్ చేస్తున్నట్లు డీఐజీ రఘురామిరెడ్డి తెలిపారు. అయితే ఈ పరిణామాలపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు పలువురు రాష్ట్రంలోని టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.
ప్రస్తుతం నారా లోకేష్ పాదయాత్ర కోనసీమ జిల్లా రాజోలు మండలంలో పొదలాడలో కొనసాగుతుంది. అయితే చంద్రబాబు అరెస్ట్ వార్త తెలుసుకున్న లోకేష్ పొదలాడ యువగళం క్యాంప్ సైట్ నుంచి విజయవాడ బయలుదేరేందుకు సిద్దమయ్యారు. అయితే లోకేష్ అక్కడి నుంచి వెళ్లకుండా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. దీంతో లోకేష్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నేల మీదే బైఠాయించి నిరసన తెలిపారు.
జగన్ లండన్‌కు వెళ్లి.. పోలీసులను తమ మీదకు వదిలారని విమర్శించారు. చంద్రబాబు పేరు ఎఫ్‌ఐఆర్‌లో లేకపోయిన అరెస్ట్ చేయడం దారుణం అని అన్నారు. తండ్రిని చూసేందుకు కొడుకు వెళ్తుంటే అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. తన వెంట నాయకులు ఎవరూ రావడం లేదని.. కుటుంబ సభ్యుడిగా తాను ఒక్కడినే వెళ్తున్నానని చెప్పారు. తనను అడ్డుకునే హక్కు ఎవరిచ్చారని పోలీసులను ప్రశ్నించారు. చంద్రబాబు వద్దకు వెళ్లకుండా తన తల్లిని, భార్యను కూడా ఆపుతారా? అని ప్రశ్నలు సంధించారు.
చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా లోకేష్ నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు బస్సులోకి వెళ్లాలని సూచించగా.. లోకేష్ రాజ్యాంగంలోని నిబంధనలను చదివి వినిపించారు. ఈ క్రమంలోనే పొదలాడ యువగళం క్యాంప్ సైట్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు.