గుంటూరు: రాష్ట్రంలోని రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధన  దక్కక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువెళ్లారు మాజీ మంత్రి నారా లోకేశ్. కనీసం పండించిన పంటను అమ్ముకుందామన్న కొనేవారు లేరని... ప్రభుత్వం కూడా రైతుల నుండి అరకోరగానే పంటను కొనుగోలు చేస్తోందని ఆరోపించారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తోందని లోకేశ్ పేర్కొన్నారు. రైతుల సమస్యల గురించి వివరిస్తూ ముఖ్యమంత్రికి లోకేశ్ ఓ బహిరంగ లేఖ రాశారు. 

లోకేశ్ బహిరంగ లేఖ యధావిధిగా 

తేదీః 20-05-20

గౌరవనీయులైన

శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి  

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు    

విషయం- రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం, గ్రామస్థాయిలోనే పంట ఉత్పత్తుల సేకరణ గురించి 

ఆరుగాలం శ్రమించి పంటలను పండించే రైతులు నేడు ఆ పంటలను కొనే నాథుడే లేక అనేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ కొనుగోళ్లు అరకొరగా ఉన్నాయి. ప్రభుత్వం చెప్పే లెక్కలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన లేదు. ఏపీలో అన్ని పంటలు కలిపి 6,17,837 మెట్రిక్ టన్నుల దిగుబడి రాగా...పండిన పంటలో 10వ వంతు మాత్రమే కొనుగోలు చేశారు. తెలంగాణలో సుమారు రూ.5వేల కోట్లతో పంటలను కొనుగోలు చేయగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం రూ.వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేసినట్లు ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్రంలో రబీలో 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రాగా..5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కూడా కొనుగోలు చేయలేదు. తెలంగాణలో 22 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని కొనుగోలు చేశారు. కొనుగోలు కేంద్రాలు కూడా అరకొరగా ఉన్నవి. 

మరోవైపు ధాన్యం, వేరుశనగ, పసుపు, పొగాకు, మొక్కజొన్న, జొన్న, కంది, శనగ ఇలా ఏ పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ఉద్యానవన, కూరగాయల రైతులు తీవ్రంగా నష్టపోయారు. వైసీపీ నేతలు దళారుల అవతారం ఎత్తి అక్రమాలకు పాల్పడుతున్నారు. మొక్కజొన్న, నిమ్మ, సపోట, అరటి రైతుల బాధలు వర్ణనాతీతం. గతేడాది మొక్కజొన్న క్వింటాలుకు రూ.2 వేల వరకు రైతుకు దక్కగా .. నేడు  1350 నుంచి రూ.1400కే కొనుగోలు చేస్తున్నారు. నిమ్మకాయలు గతేడాది కేజీ రూ.60 నుంచి 70 ఉండగా.. నేడు రూ.10 నుంచి రూ.12 మాత్రమే దక్కుతోంది. సపోట గతేడాది గంప రూ.1500 ఉండగా.. నేడు రూ.500 కూడా దక్కడం లేదు. అరటి గెల గతేడాది రూ.300 నుంచి రూ.500 ఉండగా.. నేడు కనీసం రూ.100 రూపాయలకు కూడా కొనుగోలు చేయడం లేదు. వైకాపా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం కారణంగా రైతులు తమ పంట ఉత్పత్తులను అయినకాడికి అమ్ముకుంటున్నారు. 

మద్యం అమ్మకాలపై ఉన్న శ్రద్ధ రైతుల వద్ద పంటలు కొనుగోలు చేయడంలో లేదు. అన్నదాతల బాధలు మీ ప్రభుత్వానికి కనిపించడం లేదా? రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుని వారిని మోసం చేస్తుండటం నిజం కాదా? గ్రామస్థాయిలోనే రైతుల పంట ఉత్పత్తులను ఎందుకు కొనుగోలు చేయకూడదు? వాలంటీర్ దగ్గర నుంచి గ్రామ సచివాలయం వరకు 20 నుంచి 25 మంది ప్రభుత్వ సిబ్బంది ఉన్నప్పుడు గ్రామస్థాయిలోనే పంటలను కొనుగోలు చేయాలి. లాక్ డౌన్ లో ఇబ్బందులు పడుతున్న అన్నదాతలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకు తక్షణమే గ్రామస్థాయిలో పంట ఉత్పత్తుల సేకరణ జరగాలి.

                                                                           
                  శ్రీ నారా లోకేష్
                                                      
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి