అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం తలపెట్టిన ఇళ్ల స్థలాల పంపిణీపై తెలుగుదేశం పార్టీ (టీడీీప) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్రమైన ఆరోపణలు కూడా చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఆ ఆరోపణలు చేశారు. 41 మంది ఎమ్మెల్యేలు జైలుకు వెళ్లడం ఖాయమని, వారికి చిప్పకూడు తప్పదని ఆయన అన్నారు. 

పేదలకది సెంటు స్థలం గా జగన్ రెడ్డికి,, వైకాపా ఎమ్మెల్యేలకు అది కుంభస్థలమని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. స్థల సేకరణలో అవినీతి చోటు చేసుకుందని, చదును పేరుతో దోపిడీ అని, పంపిణీ పేరుతో పేదల రక్తాన్ని జలగల్లా పీల్చడమని ఆయన వ్యాఖ్యానించారు. 

.మొత్తంగా పేదల పేరుతో జగన్ రెడ్డి త్రీ ఇన్ వన్ స్కాం విలువ 6,500 కోట్లు అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. టిడిపి హయాంలో కట్టిన నాణ్యమైన  ఇళ్లకు బులుగు రంగు వేసినంత మాత్రాన సైకిల్ బ్రాండ్ చేరిగిపోదని అన్నారు.  జగన్ కోటలోని మరుగుదొడ్డి కంటే తక్కువగా కొండలు, గుట్టలు, శ్మశానాల్లో,చెరువుల్లో ఇచ్చే స్థలంలో పేదలు ఉండే పరిస్థితి లేదని ఆయన అన్నారు.

ఇప్పుడున్న ఆధారాలతో జగనన్న జైలు పిలుస్తోందని,  పథకంలో భాగంగా41 మంది వైకాపా ఎమ్మెల్యేలు జైలులో జగన్ రెడ్డి తో పాటు చిప్పకూడు తినడం ఖాయమని ఆయన అన్నారు. ఇప్పటి వరకూ టిడిపి కేసుల వల్లనే స్థలం ఇవ్వలేక పోతున్నామని జనగ్ అన్నారని అంటూ మరి ఇప్పుడెలా ఇస్తున్నావ్ జగన్ రెడ్డి అందుకే నిన్ను ఫేక్ సిఎం అనేది అని నారా లోకేష్ అన్నారు.