ఓడిపోయినప్పుడు తనను చాలామంది ఎగతాళి చేశానని.. మళ్లీ మంగళగిరి నుంచే పోటీ చేయాలనుకుంటున్నావా అని చంద్రబాబు అడిగారని లోకేష్ వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో మంగళగిరి రూపురేఖలు మార్చే బాధ్యత తనదేనని లోకేష్ హామీ ఇచ్చారు. 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆ నేపథ్యంలో బుధవారం పట్టణానికి చెందిన టీడీపీ నేతలు, మద్ధతుదారులతో సమావేశమయ్యారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ.. మంగళగిరి ప్రజలది మంచి మనసని, ఈ ప్రాంతం మినీ ఆంధ్రప్రదేశ్ అన్నారు. రాష్ట్రంలో వున్న అన్ని కులాలవారు మంగళగిరిలో నివసిస్తుననారని లోకేష్ తెలిపారు.

యువగళం పాదయాత్రలో నేను విన్న సమస్యలన్నీ అంతకుముందే మంగళగిరిలో తెలుసుకున్నానని ఆయన చెప్పారు. 2019లో మంగళగిరి ప్రజలు తనను కరుణించలేదని.. అప్పుడు లోకేష్ అంటే ఏంటో ప్రజలకు తెలియదని, ఎన్నికల్లో ఓడినా తాను నియోజకవర్గాన్ని వీడలేదని లోకేష్ పేర్కొన్నారు. గడిచిన 9 నెలల్లో మంగళగిరి ప్రజలతో మమేకమయ్యానని.. సొంత నిధులతో 27 కార్యక్రమాలు అమలు చేశానని ఆయన చెప్పారు. 

ఓడిపోయినప్పుడు తనను చాలామంది ఎగతాళి చేశానని.. మళ్లీ మంగళగిరి నుంచే పోటీ చేయాలనుకుంటున్నావా అని చంద్రబాబు అడిగారని లోకేష్ వెల్లడించారు. దీంతో తాను తగ్గేదే లేదని చెప్పానని.. వైసీపీ ప్రభుత్వం మంగళగిరికి ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. ఆర్కేను గెలిపిస్తే మంత్రిని చేస్తానని మాటతప్పి, మడమ తిప్పారని సీఎం జగన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరో 100 రోజులు మాత్రమే సమయం వుందని, నియోజకవర్గంలోని పెద్దలను కలుస్తున్నానని.. అందరం కలిసి పనిచేద్దామని లోకేష్ తెలిపారు. గడప గడపకు వెళ్లి టీడీపీ హామీలను వివరించాలని.. బాబు ష్యూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ పేరిట చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించారని చెప్పారు. 

టీడీపీ నేతలు, కార్యకర్తలు గ్రూప్ రాజకీయాల జోలికి వెళ్లొద్దని.. ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి తాను ఉన్నానని ఆయన వెల్లడించారు. మనవారిని ఇబ్బంది పెట్టినవారిని ఎట్టి పరిస్ధితుల్లోనూ పార్టీలో చేర్చుకోనని లోకేష్ స్పష్టం చేశారు. తాను మంగళగిరి నుంచే పోటీ చేస్తున్నానని.. వైసీపీ పేటీఎం బ్యాచ్ ప్రచారాలు నమ్మొద్దని , మంగళగిరిలో భారీ మెజారిటీతో పసుపు జెండా ఎగురవేయాలన్నారు. వచ్చే ఐదేళ్లలో మంగళగిరి రూపురేఖలు మార్చే బాధ్యత తనదేనని లోకేష్ హామీ ఇచ్చారు.