రాజమండ్రి బయలుదేరిన లోకేష్... మాజీ మంత్రులను అడ్డుకున్న పోలీసులు, తీవ్ర ఉద్రిక్తత (వీడియో)
సెంట్రల్ జైల్లో వున్న తన తండ్రిని కలిసేందుకు నారా లోకేష్ ఉండవల్లి నివాసం నుండి రాజమండ్రికి బయలుదేరారు. ఆయితే అయన వెంట వెళ్లడానికి ప్రయత్నించిన మాజీ మంత్రులను పోలీసులు అడ్డుకున్నారు.

విజయవాడ : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో వున్న మాజీ సీఎం, టిడిపి చీఫ్ చంద్రబాబును నేడు ఆయన తనయుడు నారా లోకేష్ కలవనున్నారు. కొద్దిరోజులుగా దేశ రాజధాని న్యూడిల్లీలో వుంటున్న లోకేష్ నిన్న(గురువారం) రాత్రి ఏపీకి చేరుకున్నారు. ఇవాళ(శుక్రవారం) ఉదయం ఉండవల్లి నివాసం నుండి రాజమండ్రికి రోడ్డు మార్గంలో బయలుదేరారు. అయితే ఆయన వెంట వెళుతున్న మాజీ మంత్రులు, టిడిపి నేతలను పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది.
లోకేష్ కాన్వాయ్ లో వెళుతున్న మాజీ మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, టిడిపి నేత యార్లగడ్డ వెంకట్రావును పోలీసులు అడ్డుకున్నారు. పొట్టిపాడు టోల్ ప్లాజా వద్ద వారి కారుకు భారీకేడ్లు అడ్డుపెట్టారు పోలీసులు. దీంతో పోలీసులపై టిడిపి నేతలు సీరియస్ అయ్యారు. లోకేష్ వెంట రాజమండ్రి వెళ్లనివ్వకుండా అడ్డుకున్న పోలీసులతో మాజీ మంత్రులు వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
వీడియో
ఇదిలావుంటే తండ్రి చంద్రబాబును కలిసేందుకు రాజమండ్రి వెళుతున్న లోకేష్ కోసం టిడిపి నాయకులు, కార్యకర్తలు రోడ్డుపైకి వచ్చారు. చంద్రబాబుకు మద్దతుగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ లోకేష్ కు మంగళహారతులు పట్టారు మహిళలు. చంద్రబాబు తో మేము, అంతిమ విజయం ధర్మానిదే అంటూ ప్లకార్డులు పట్టుకుని గన్నవరం, దెందులూరు నియోజకవర్గాల మహిళలు సంఘీభావం తెలిపారు.
Read More జోగి రమేష్ కు నిరసన సెగ... సొంత ఇలాకాలోనే మంత్రికి చేదు అనుభవం (వీడియో)
టిడిపి నేతలు, కార్యకర్తలు కూడా పసుపు జెండాలు పట్టుకుని రోడ్డుపైకి వచ్చారు. ఇలా తనకోసం ఎదురుచూస్తున్న మహిళలు, టిడిపి శ్రేణులను కారు ఆపి పలకరించారు లోకేష్. చంద్రబాబు త్వరలోనే బయటకు వస్తారని... ధైర్యంగా ఉండాలని వారికి సూచించి ముందుకు వెళ్లిపోయారు లోకేష్.