జోగి రమేష్ కు నిరసన సెగ... సొంత ఇలాకాలోనే మంత్రికి చేదు అనుభవం (వీడియో)
సొంత నియోజకవర్గంలో గడపగడపకు కార్యక్రమాన్ని చేపట్టిన మంత్రి జోగి రమేష్ కు చేదు అనుభవం ఎదురయ్యింది.

పెడన : గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజల్లోకి వెళ్ళిన మంత్రి జోగి రమేష్ కు చేదు అనుభవం ఎదురయ్యింది. పెడన నియోజకవర్గ పరిధిలోని జింజర్ గౌడపాలెం గ్రామంలో మంత్రి కాన్వాయ్ ని స్థానికులు అడ్డుకున్నారు. మంత్రి గ్రామంలో పర్యటిస్తున్న సమయంలోనే పోలీసులు టిడిపి సానుభూతిపరుడిని అరెస్ట్ చేయడమే ఈ నిరసనకు కారణమయ్యింది. ఈ అరెస్ట్ కు మంత్రి జోగి రమేష్ కారణమని భావించిన గ్రామస్తులు కాన్వాయ్ ని అడ్డుకుని నిరసన తెలిపారు.
కృష్ణా జిల్లాలోని సొంత నియోజకవర్గం పెడనలో మంత్రి జోగి రమేష్ గురువారం పర్యటించారు. జింజేరు గ్రామంలో గడపగడపకు కార్యక్రమాన్ని చేపట్టారు.స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి వైసిపి ప్రభుత్వాల పథకాలు, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ఈ క్రమంలోనే టిడిపి సానుభూతిపరుడు కట్టా శివాజీ ఇంటికి కూడా మంత్రి వెళ్ళారు.
వీడియో
జగన్ సర్కార్ ఇన్ని పథకాలు, ఇంత అభివృద్ది చేస్తుంటే ఇంకా టిడిపి నాయకులతో ఎందుకు తిరుగుతున్నావు అంటూ శివాజీని మంత్రి నిలదీసారు. కోడిపందాలు నిర్వహిస్తావంటగా... నీ అంతుచూస్తానని బెదిరించి జోగి రమేష్ ముందుకు వెళ్లిపోయారు. కొద్దిసేపటికే శివాజీ ఇంటికి స్థానిక ఎస్సై సిబ్బందితో చేరుకుని సోదాలు నిర్వహించారు. కోడికత్తులు దొరికాయంటూ శివాజీని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.
Read More టీడీపీ - జనసేన పొత్తు .. గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు
శివాజీ అరెస్ట్ తో గ్రామస్తుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మంత్రి జోగి రమేష్ ఆదేశాలతోనే పోలీసులు శివాజీని అరెస్ట్ చేసారంటూ నిరసనకు దిగారు. మంత్రి కాన్వాయ్ ని అడ్డుకుని ముందుకు వెళ్లనివ్వకుండా ఆందోళన చేపట్టారు. స్టేషన్ కు తీసుకువెళ్లిన శివాజీని వెంటనే విడుదల చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేసారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు శివాజీని విడిచిపెట్టారు. దీంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.