అనంతపురం జిల్లా ధర్మవరం మండలం, బడన్నపల్లిలో స్నేహాలతను అత్యంత కిరాతకంగా హత్యచేసిన ఘటన తీవ్రంగా కలిచివేసిందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. 

రాజేష్, కార్తీక్ తన కూతురిని వేధిస్తున్నారు అంటూ ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం వలనే ఈ రోజు తన బిడ్డ హత్యకు గురైందంటూ ఆ తల్లి పడుతున్న బాధ చూస్తుంటే కంట కన్నీరు ఆగడం లేదన్నారు.

"

జగన్ రెడ్డి నిర్లక్ష్యం మహిళల పాలిట శాపంగా మారింది. వైకాపా ప్రభుత్వ మొద్దునిద్ర వలనే మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. స్నేహాలతని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. బిడ్డను కోల్పోయిన ఆ తల్లిదండ్రులకు ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో దారుణమైన హత్య జరిగింది. ఎస్బీఐ ఉద్యోగిని దుండగులు హత్య చేసి ఆమె శవాన్ని కాల్చేశారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా ధర్మవరం మండలం బడన్నపల్లిలో జరిగింది.

మృతురాలిని స్నేహలతగా గుర్తించారు. ఆమె అనంతపురంలోని ఎస్బీఐలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగినిగా పనిచేస్తోంది. బైక్ మీద ప్రతి రోజూ వెళ్లి వస్తోంది. స్నేహలత కనిపించడం లేదని కుటుంబ సభ్యులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తింపు కార్డు ఆధారంగా ఆమెను గుర్తించారు. ఓ యువకుడిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు ఇప్పటి వరకు తెలియరాలేదు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.