ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉత్తరకొరియా నియంత కిమ్‌ను జగన్ మించి పోయారని విమర్శించారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉత్తరకొరియా నియంత కిమ్‌ను జగన్ మించి పోయారని విమర్శించారు. జగన్ వైసీపీ పార్టీకి శాశ్వ‌త అధ్య‌క్షుడిగా త‌న‌కి తానే ప్ర‌క‌టించుకున్నాన‌ని.. రాష్ట్రానికి శాశ్వ‌త ముఖ్య‌మంత్రిని అనుకుంటున్నారేమోనని ఎద్దేవా చేశారు. టీడీపీ నేత, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్‌ సెక్యూరిటీ అంశంపై నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. వైసీపీ డేటా చోరీ, ఫోన్ ట్యాపింగ్ గుట్టురట్టు చేశారనే అక్కసుతోనే పయ్యావుల కేశవ్ సెక్యూరిటీ తొలగించేశారని ఆరోపించారు. 

ఇప్పటికే జగన్ ఆర్థిక ఉగ్రవాదాన్ని పయ్యావుల కేశవ్ గణంకాలతో సహా వెల్లడించారని.. ఆయన అదనపు భద్రత కావాలని కోరితే ఉన్న సెక్యూరిటీని తొలగించారని విమర్శించారు. ఈ కక్ష సాధింపు చర్యల ద్వారా వైసీపీ సర్కార్ వేల కోట్ల మాయం, ఫోన్స్ ట్యాపింగ్ నిజమేనని ఒప్పుకున్నట్టేనని కామెంట్ చేశారు. తక్షణమే పయ్యావుల కేశవ్‌కు గన్‌మెన్లను కేటాయించి సెక్యూరిటీని పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. 

మరోవైపు పయ్యావుల కేశవ్‌కు భద్రతను ప్రభుత్వం పునరుద్ధరించాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. ‘‘పెగాసస్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో ఆధారాలతో సహా ప్రభుత్వాన్ని ఎండగడుతూ, అక్రమాలను ప్రశ్నిస్తున్నారు అని మా పార్టీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు అయిన పయ్యావుల కేశవ్ సెక్యూరిటీని ఉపసంహరిస్తారా? ప్రతీకార రాజకీయాలు చేయటానికా ప్రజలు మీకు పట్టం గట్టింది?’’ అని ప్రశ్నించారు. 

తక్షణమే పయ్యావుల కేశవ్ గారి భద్రతను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నట్టుగా అచ్చెన్నాయుడు ట్వీట్ చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇదే మాదిరిగా వ్యవహరిస్తే జగన్ రెడ్డి పాదయాత్ర చేయగలిగే వారా అని ప్రశ్నించారు.