పాదయాత్ర పెంచుతూ పోతా అంటే జగన్ రెడ్డిది పెద్ద మనస్సు అనుకున్నాం... కానీ ఇప్పుడు ప్రజలపై భారం పెంచుకుంటూ పోతున్నాడని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. 

 టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విశాఖ పర్యటన కొనసాగుతోంది. నేరుగా సింహాచలం ఆలయానికి చేరుకున్న వరాహ నరసింహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం గాజువాక లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు లోకేష్. టిడిపి తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు, ముఖ్య నేతలతో కలిసి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే టిడిపి మ్యానిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించి ఓటు వెయ్యాలని కోరారు. ఆ తర్వాత గాజువాకలోనే రోడ్ షో లో నిర్వహించారు. 

ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... పాదయాత్ర పెంచుతూ పోతా అంటే జగన్ రెడ్డి ది పెద్ద మనస్సు అనుకున్నాం... కానీ ఇప్పుడు ప్రజలపై భారం పెంచుకుంటూ పోతున్నాడని ఎద్దేవా చేశారు. నిత్యావసర ధరలు, రేషన్ సరుకుల ధరలు, విద్యుత్ ఛార్జీలు, ఇంటి పన్ను,ఇసుక, సిమెంట్ ధరలు పెరిగాయి...పెట్రోల్ సెంచరీ కొట్టింది, గ్యాస్ వెయ్యి అవుతోందన్నరు. ఇలా జగన్ ప్రభుత్వం అన్నీ పెంచుకుంటూ పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 

వీడియో

''ఎన్నికల సమయంలో ఇచ్చిన సన్నబియ్యం హామీ కాస్తా నాణ్యమైన బియ్యం అయ్యాయి. డోర్ డెలివరీ అంటే ఇంటికి వచ్చి సరుకులు ఇస్తారు అనుకున్నారు. కానీ ప్రజలే సరుకుల బండి డోర్ దగ్గర క్యూ కట్టి సరుకులు తీసుకోవాల్సిన పరిస్థితి. ఒక్క అవకాశం ఇస్తే విశాఖ ఉక్కు అమ్మేసాడు. రెండో ఛాన్స్ ఇస్తే విశాఖపట్నాన్నే అమ్మేస్తాడు. 28మంది ఎంపీలు ఉండి ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారు.అంతే కాక విశాఖ ఉక్కు ని అమ్మేస్తుంటే కేంద్రాన్ని నిలదీయలేని దుస్థితిలో జగన్ రెడ్డి ఉన్నారు'' అని మండిపడ్డాడు.

''ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి 10 వాగ్దానాలతో మీ ముందుకు వచ్చాం. 1.అన్నా క్యాంటిన్ తిరిగి ప్రారంభిస్తాం. 2.పాత పన్ను మాఫీ-ప్రస్తుతం ఉన్న పన్నులో 50 శాతం తగ్గిస్తాం.3.శుభ్రమైన ఊరు-శుద్ధమైన నీరు4.ప్రతి ఆరు నెలలకోసారి జాబ్ మేళా5.సుందరీకరణ మిషన్(పార్క్ ,ఓపెన్ జిమ్,ఎల్ఈడి వీధి దీపాలు,అండర్ గ్రౌండ్ డ్రైనేజీ)6.త్రాగు నీరు,టాయిలెట్ సౌకర్యంతో ఆటో స్టాండ్.7.మెప్మా మెంబర్లకు మీటింగ్ హాల్స్,మెప్మా బజార్లు,వడ్డీలేని రుణాల కోసం బ్యాంక్ లింకేజ్8.పేదలందరికీ టిడ్కో ఇళ్ల పంపిణి9.పారిశుధ్య కార్మికులకు 21 వేలకు జీతం పెంపు10.ఉచిత మంచినీటి కనెక్షన్,నీటి పన్ను రద్దు చేస్తాం'' అంటూ హామీల గురించి వివరించారు. 

''కుడి చేత్తో 100 రూపాయిలు ఇచ్చి ఎడమ చేత్తో 1000 రూపాయిలు కొట్టేస్తున్నారు. ఆటో డ్రైవర్లకు 10 వేలు ఇచ్చాం అంటున్నారు. ఏడాదికి 30 వేలు ఫైన్లు కింద వసూలు చేస్తున్నారు. రెండేళ్లలో విశాఖపట్నంలో జరిగిన అభివృద్ధి శూన్యం. ఒక్క రోడ్డు వెయ్యలేదు, ఒక్క నీళ్ల ట్యాంక్ కట్టలేదు, ఒక్క ఎల్ఈడి బుల్బ్ పెట్టలేదు. వైసిపి గెలిచిన తరువాత విశాఖలో భూకబ్జాలు, దోపిడీ, విధ్వంసం ఎక్కువయ్యాయి. నగరంలో ప్రశాంతత లేకుండా పోయింది. విశాఖలో ఆగిపోయిన అభివృద్ధి మళ్ళీ కొనసాగాలంటే మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి'' అని లోకేష్ కోరారు.