పదో తరగతి పరీక్షలో ఫెయిలయిన విద్యార్థులతో టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ నిర్వహించిన జూమ్ మీటింగ్ లో వైసిపి నేతలు పాల్గొనడం రాజకీయ దుమారం రేపుతోంది. ఈ విషయంపై ఇరు పార్టీల నాయకులు సవాళ్లు విసురుకుంటున్నారు. 

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో పదో తరగతి పరీక్షల (ap ssc exams 2022) చుట్టూ ప్రస్తుత రాజకీయం జరుగుతోంది. పరీక్షల నిర్వహణ నుండి తాజాగా రిజల్ట్స్ వెల్లడి వరకు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. పరీక్షల సమయంలో ప్రశ్నపత్రాలు లీకేజీ, ప్రస్తుతం అతి తక్కువు ఉత్తీర్ణత శాతం నమోదవడమే విద్యార్థుల జీవితాలతో జగన్ సర్కార్ ఆటలాడుకుంటోందని అర్థమవుతోందని ప్రతిపక్ష టిడిపి ఆరోపిస్తోంది. మొదటి నుండి పదో తరగతి విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న నారా లోకేష నిన్న(గురువారం) నిర్వహించిన జూమ్ మీటింగ్ రాజకీయ వేడిని మరింత పెంచింది. 

పదో తరగతి పరీక్షలో ఫెయిలయిన విద్యార్థులతో టిడిపి జాతీయ కార్యదర్శి నారా లోకేష్ (nara lokesh) జూమ్ ద్వారా ముచ్చటించారు. అయితే ఈ మీటింగ్ లోకి మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మల్యే వల్లభనేని వంశీతో పాటు మరికొందరు వైసిపి నాయకులు ప్రత్యక్షమయ్యారు. ఇలా తమ జూమ్ మీటింగ్ లోకి అక్రమంగా చొరబడ్డారంటూ టిడిపి మండిపడుతుంటే... తమకు సమాధానం చెప్పలేకే మీటింగ్ ను అర్ధాంతరంగా ముగించారని వైసిపి నాయకులు అంటున్నారు. ఈ విషయంలో టిడిపి, వైసిపి నాయకులకు మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. 

తాము నిర్వహించిన జూమ్ మీటింగ్ ఈ ఏడాది ఫెయిల్ అయిన వాళ్ళకే... ఎప్పుడో పది పరీక్షలు, పద్దతి తప్పిన వైసిపి కుక్కలకు కాదంటూ కొడాలి నాని, వల్లభనేని వంశీకి ఇప్పటికే లోకేష్ చురకలు అంటించారు. విద్యార్థుల సమస్యలపై పోరాడుతుంటే దద్దమ్మలుగా, చేతకానొళ్లలా వీడియో పాల్గొనడం ఏమిటి... దీని ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారో అర్థం కావడంలేదన్నారు. మీకు నిజంగానే చిత్తశుద్ది వుంటే ప్రిజినరీ జగన్ కు చెప్పండి... రీ వెరిఫికేషన్, సప్లిమెంటరీ ఉచితంగా చెద్దామని... పదో తరగతి రిజల్ట్స్ తర్వాత జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలపై ఈ సన్నబియ్యం సన్నాసి, వంశీ ఏం సమాధానం చెబుతారు అని లోకేష్ విరుచుకుపడ్డారు. 

అంతేకాదు ట్విట్టర్ వేదికన లోకేష్ సీఎం జగన్ కు సవాల్ విసిరారు. ''నీ వైసీపీ కుక్కల్ని పంపడం కాదు జగన్ రెడ్డి... స్వయంగా నువ్వే రా... పదో తరగతి పాస్ పర్సంటేజ్ ఎందుకు తగ్గిందో నీ బ్లూ మీడియా సాక్షి ఛానల్ లోనే చర్చించుకుందాం'' అంటూ లోకేష్ ట్వీట్ చేసారు. 

లోకేష్ ట్వీట్ కు ఇదే ట్విట్టర్ వేదికన లోకేష్ సవాల్ కు వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి స్పందించారు. ''టెన్త్ ఫలితాల మీద కూడా పేలాలు ఏరుకోవడం ఏమిటి పప్పూ. జులై 6-15 మధ్య మళ్లీ పరీక్షలు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించినా పిల్లలతో జూమ్ మీటింగ్ పెట్టడం, ‘ఏం కావట్లేదే’ అనే శాడిస్టు బుద్ధి కనిపిస్తోంది. జూమ్ కాస్తా రసాభాసై మధ్యలోనే పారిపోయావుగా. అయినా జూమ్ లోకి వస్తేనే మ్యూట్ చేసి పారిపోయావ్. నేరుగా రమ్మని సవాల్ విసిరావే. డైరెక్ట్ గా వస్తే తట్టుకోగలవా లోకేశం? చిన్న పిల్లలతో రాజకీయం చెయ్యడం కాదు. పోయి పప్పు తిని పడుకో చిట్టయ్యా'' అంటూ లోకేష్ పై విజయసాయి సెటైర్లు వేసారు. 

తాజాగా విజయసాయి వ్యాఖ్యలపై మాజీ మంత్రి అయ్యన్న ఫైర్ అయ్యాడు. ''దొంగ లెక్కలు రాసి ఊచలు లెక్కెట్టిన నువ్వు సవాల్ విసరడం ఎంటి సాయి రెడ్డి. నీ రేంజ్ కి మా ఆఫీస్ లో అటెండర్ చాలు. లోకేష్ చర్చకు సిద్ధం అన్నది జగన్ తో. మీ వాడి లో దమ్ముంటే చర్చకు రమ్మను. ఎనీ బ్లూ మీడియా లోకేష్ ఈజ్ రెడీ'' అని అయ్యన్న సవాల్ విసిరారు. 

''పారిపోయేది మీ నత్తి పకోడీ రెడ్డే వీసా రెడ్డి. బయటకి రావాలి అంటే భయం, ఏ భాష మాట్లాడినా బూతులు, పరదాల చాటున పర్యటించి పారిపోయే నీ అల్లుడికి లండన్ మందులు పనిచెయ్యడం లేదు మందులు మార్చు. దమ్ముంటే మీ నత్తి పకోడీ రెడ్డి ని లైవ్ లో మాట్లాడమను చూద్దాం ఎవడు మగొడో తెలిపొద్ది'' అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.

''20, 30 ఏళ్ల క్రితం పదో తరగతి ఫెయిల్ అయిన వైసిపి నాయకుల కోసం ప్రత్యేక జూమ్ కాన్ఫరెన్స్ త్వరలోనే నిర్వహించబడుతుంది. పరీక్ష పత్రాలు కొట్టేసిన జగన్ తో పాటు పరీక్ష తప్పిన వైసిపి నాయకులు అందరూ ఆహ్వానితులే. నేను స్వయంగా జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి మీ అందరికీ నచ్చే విధంగా వైసిపి ప్రత్యేక భాషలోనే మాట్లాడతాను..'' అంటూ అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు.