ఫ్లెక్సీల మీద నిషేధం విధించడం వల్ల లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారని వారిని ఆదుకోవాలని సీఎం వైఎస్ జగన్ ను.. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కోరారు.
అమరావతి : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. పర్యావరణ పరిరక్షణ కోసమంటూ ప్రత్యామ్నాయం ఏమీ చూపకుండా ఫ్లెక్సీలు నిషేధం విధించడంతో లక్షలాది మంది కుటుంబాలతో సహా నడిరోడ్డున పడ్డారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రింటింగ్ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న యజమానులు, ఉద్యోగులు, కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
ఫ్లెక్సీలు తయారు చేసే యూనిట్లపై ఆధారపడి జీవిస్తున్నవారితో కనీసం చర్చించకుండా ఆగమేఘాలపై ఫ్లెక్సీలపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించి జీవో నెంబర్ 65 తీసుకురావడం అనాలోచిత చర్య అన్నారు. లక్షలాది మంది జీవనం ప్రశ్నార్థకమై ప్రభుత్వ పెద్దలకు తమ గోడు వెళ్లబోసుకోగా సడలింపులతోనూ, కొన్ని హామీలిస్తూ జీవో నెంబర్ 75 విడుదల చేశారని పేర్కొన్నారు. సర్కారు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే సడలింపు గడువు ముగిసిపోయిందని, ఫ్లెక్సీ పరిశ్రమలపై ఆధారపడిన లక్షలాది మంది బతుకులు త్రిశంకుస్వర్గంలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
దారుణం.. అమ్మ అన్నం అడిగిందని.. భార్యతో కలిసి దాడిచేసిన కొడుకు..
ఫ్లెక్సీ ప్రింటర్‌ను క్లాత్ ప్రింటర్ మిషన్ గా అప్ గ్రేడ్ చేసుకునేందుకు ఆర్థిక సాయం అందిస్తామని ఇచ్చిన హామీ మరిచిపోవడంతో, బ్యాంకర్లు లోన్లు ఇవ్వడంలేదన్నారు. ఫ్యాబ్రిక్ క్లాత్ అందుబాటులో లేదని, మిషన్లు అప్ గ్రేడ్ కి అవకాశంలేదని, ఇటువంటి పరిస్థితిలో నిషేధానికి మరింత సమయం ఇవ్వాలని కోరుతున్న ఫ్లెక్స్ యూనియన్ డిమాండ్ ని సానుకూలంగా పరిశీలించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రత్యామ్నాయం చూపకుండా నిషేధించి తప్పు చేశారని, ఇప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మరో తప్పు చేస్తూ ఫ్లెక్సీ పరిశ్రమలపై ఆధారపడిన లక్షలాది మందికి అన్యాయం చేస్తున్నారని నారా లోకేష్ ఆరోపించారు.
మానవతా దృక్పథంతో ఆలోచించి మీరిచ్చిన హామీ మేరకు మిషన్ల అప్ గ్రేడు చేసుకోవడానికి బ్యాంకు రుణాలు ఇప్పించి, ఫ్యాబ్రిక్ క్లాత్ అందుబాటులోకి తెప్పించి, దీనికి తగిన శిక్షణ ఇచ్చిన తరువాతే ఫ్లాస్టిక్ ఫ్లెక్సీల నిషేధం విధిస్తే బాగుంటుందని ప్రభుత్వానికి సూచించారు.
