తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు ఢిల్లీలో నిరసనలకు దిగుతున్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు ఢిల్లీలో నిరసనలకు దిగుతున్నారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తూ.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో పాటు పలువురు నేతలు సోమవారం పార్లమెంట్‌ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. తాజాగా మంగళవారం ఉదయం నారా లోకేష్ టీడీపీ నేతలతో కలిసి ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌ వద్ద నిరసనకు దిగారు. రాజ్‌ఘాట్‌లో మహాత్మునికి నివాళులర్పించిన టీడీపీ నేతలు.. రాజ్‌ఘాట్ వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి మౌన దీక్ష చేపట్టారు. 

ఈ దీక్షలో లోకేష్‌తో పాటు టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్, పార్టీ నేతలు గంటా శ్రీనివాసరావు, మురళీమోహన్, కాల్వ శ్రీనివాసు, కొనకళ్ల నారాయణలతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు కూడా అక్కడి నిరసనలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ మాట్లాడుత.. కోర్టు విచారణలో న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడుపై తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. న్యాయం, ధర్మంపై తమకు నమ్మకం ఉందని చెప్పారు. 

ఇదిలాఉంటే, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఏసీబీ కోర్టు జారీచేసిన జ్యూడిషియల్ రిమాండ్ ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని చంద్రబాబు ఆ పిటిషన్‌లో కోరిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో అవకతవకలు జరిగాయంటూ చంద్రబాబుపై కేసు నమోదైంది. ఈ కేసులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు విచారణ జరగనుంది.