గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజాదనాన్ని దుబారా చేస్తున్నారని మాజీ మంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా లోకేష్ ఆరోపించారు. గతంలో జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమంలో వాటర్ బాటిల్స్ కోసం లక్షలు ఖర్చుచేశారని... తాజాగా జరిగిన ఓ మీటింగ్ లో కూడా నీళ్ల కోసం వైసిపి ప్రభుత్వం లక్షలు ఖర్చుచేసినట్లు చూపించారని లోకేష్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం జారీచేసిన పత్రాలను జతచేస్తూ లోకేష్ ట్వీట్ చేశారు. 

''డ‌బ్బులు మంచినీళ్ల‌లా ఖ‌ర్చు చేశారంటే ఇదే! రాజుల సొమ్ము రాళ్ల పాలు, ఏపీ ప్ర‌జ‌ల సొమ్ము సీఎం నీళ్ల‌పాలు. సీఎం ఒక మీటింగ్‌లో తాగిన వాట‌ర్‌ బాటిళ్లు, మ‌జ్జిగ ప్యాకెట్లు ఖ‌రీదు అక్ష‌రాలా 43.44 ల‌క్ష‌లు. ఒక్క‌రోజులో ఇంత తాగారంటే అది అమృత‌మైనా అయ్యుండాలి, లేదంటే స్కామైనా చేసుండాలి'' అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. 

''ఏడాది క్రితం జ‌గ‌న్‌రెడ్డి ప్ర‌మాణ‌స్వీకారం రోజున‌ వాట‌ర్ బాటిల్స్‌, స్నాక్స్‌కి 59.49 లక్షలు బిల్లు అయ్యింద‌ట‌! తిన్న‌వి స్నాక్సా? క‌రెన్సీ నోట్లా జ‌గ‌న్‌రెడ్డి గారూ!'' అంటూ లోకేష్ మరో ట్వీట్ చేశారు. 

మరో ట్వీట్ లో ''పాదయాత్రలో ముద్దులు, ఇప్పుడు గుద్దులు.పేదల భూములు లాక్కొని పేదలకే అమ్మడం వైఎస్ జగన్ మార్క్ రివర్స్ టెండర్. టిడిపి హయాంలో నిరుపేదల కోసం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో నిర్మించుకున్న గుడిసెలను కూల్చివేయడం జగన్ గారి అహంకార ధోరణకి నిదర్శనం'' అని లోకేష్ మండిపడ్డారు. 
  
''మీకు ఉండటానికి విల్లాలు,  రాజప్రసాదాలు కావాలి పేదవాడికి గుడిసె వేసుకునే హక్కు కూడా లేదా?'' అంటూ ఎమ్మిగనూరులో నిరుపేదలు వేసుకున్న గుడిసెలను
అధికారులు తొలగించడంపై లోకేష్ ట్విట్టర్ వేదికన సీరియస్ అయ్యారు.