హైదరాబాద్: హైదరాబాద్ గండిపేటలోని ఎన్టీఆర్ మోడల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకల్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఈ వార్షికోత్సవ వేడుకలకు సీఎం చంద్రబాబునాయుడు, నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, ఆయన తనయుడు దేవాన్ష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా అద్భుత ప్రతిభ కనబరిచిన ప్రీతి అనే విద్యార్థినికి ప్రైజ్ ఇవ్వాల్సిందిగా నారా లోకేష్ ను ఆహ్వానించారు. లోకేష్ పక్కనే దేవాన్ష్ కూడా ఉన్నారు. అయితే ఆ విద్యార్థిని లకేష్ తోపాటు దేవాన్ష్ చేతులు మీదుగా ప్రైజ్ తీసుకోవాలని ఆశపడింది. 

దాంతో లోకేష్ ప్రీతికి బహుమతి ఇవ్వమని దేవాన్ష్ కి చెప్పారు. దేవాన్ష్ మాత్రం ఇవ్వలేదు. చేతులు రెండు ముందుకు లాగే ప్రయత్నం చేశారు లోకేష్. అయినా అలక వీడని దేవాన్ష్ తన రెండు చేతులను వెనక్కి లాగేసుకున్నారు. ఎంత బ్రతిమిలాడినా దేవాన్ష్ మాత్రం కరగలేదు. 

దీంతో లోకేష్ కింద కూర్చుని ఫోటోలు తీస్తున్నారు అటు చూడు ఇటు చూడు అని చెప్పినా అలక మాత్రం వీడలేదు. చివరికి ఒళ్లో కూర్చోబెట్టుకుని ప్రైజ్ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది లోకేష్ కి. దేవాన్ష్ అలగడం, లోకేష్ బుజ్జగించడం, అటు భువనేశ్వరితోపాటు  వేదికపై ఉన్న పెద్దలు ఈ దృశ్యాన్ని ఆసక్తిగా గమనించారు. 

దేవాన్ష్ అలక వేదికపై ఒకనొకసారి నవ్వుల వర్షం కురిపించింది. లోకేష్ మాత్రం కుమారుడిని బుజ్జగించేందుకు పడిన పాట్లు నవ్వులు తెప్పించాయి. ఎంత స్థాయి అయినా తండ్రికి కొడుకు కొడుకే కదా. ఆ ముద్దు, ముచ్చట్లు వేరు కదా.